
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చిట్టచివరి ఏడో ఫేజ్ పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీశ్ తివారి, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్‌తో పాటు పలువురు కీలక నేతలు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్‌లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బిహార్‌లో 8, ఒడిశాలో 6, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగడ్ లోక్‌సభ సెగ్మెంట్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 95 మంది మహిళా క్యాండిడేట్లు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 10.09 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజ్‌లలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది.
వారణాసి నుంచి మోదీ పోటీ
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడో సారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. 1990 కాలం నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉన్నది. అయోధ్యలో నిర్మించిన రామ మందిర అంశమే ఎజెండాగా బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. అదేవిధంగా ఘాజిపూర్ సెగ్మెంట్ పై కూడా అందరి దృష్టి ఉన్నది. ఇక్కడ బీజేపీ తరఫున పారస్ నాథ్ రాయ్, ఎస్పీ నుంచి ముక్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ బరిలో ఉన్నాడు.
పాట్నసాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్
బిహార్‌లోని పాట్న సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరఫున అన్షుల్ అవిషేక్ కుశ్వాహా పోటీలో ఉన్నాడు. ఇదే సెగ్మెంట్ నుంచి 2009, 2014లో బాలీవుడ్ యాక్టర్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఆయన బీజేపీని వీడారు. పాటలీపుత్ర సెగ్మెంట్ నుంచి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి రామ్ క్రిపాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
మండి నుంచి కంగనా వర్సెస్ విక్రమాదిత్య సింగ్
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ మాజీ సీఎం, దివంగత నేత వీరభద్ర సింగ్ కొడుకే విక్రమాదిత్య సింగ్. 2014, 2019 ఎన్నికల్లో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్‌పై వరుసగా బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ గెలిచారు. 2021లో శర్మ చనిపోయారు. తర్వాత జరిగిన బై ఎలక్షన్స్‌లో ప్రతిభా సింగ్ గెలిచారు. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్.. హిమాచల్‌కు రెండు సార్లు సీఎంగా ఉన్నారు. ఇక ఠాకూర్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి సత్పాల్ బరిలో ఉన్నారు.
సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్
పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు రీజినల్, నేషనల్ లెవల్ న్యూస్ చానల్స్‌తో పాటు ఇండిపెండెంట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించనున్నాయి.
రూ.1,100 కోట్లు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో రూ.1,100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ శుక్రవారం వెల్లడించింది. భారీ మొత్తంలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రూ.390 కోట్ల నగదును ఐటీ శాఖ సీజ్ చేసింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎలక్షన్లలో సీజ్ చేసిన నగదు విలువ దాదాపు 182% అధికమని వెల్లడించింది. తెలంగాణ, ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో దాదాపు వంద కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.
ఎండను తట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు
పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌలత్‌తో పాటు వృద్ధుల కోసం వీల్చైర్లు, షామియానాలు, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. ఆరు ఫేజ్‌ల ఎన్నికల్లో ఎండను లెక్కజేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ పేర్కొన్నది. ఐదు, ఆరు దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. కాగా, 2019లో ఈ 57 సీట్లకు జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 25 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8, టీఎంసీ 9, బీజేడీ 4, జేడీయూ 3 సహా ఇతర చిన్న పార్టీలు మిగతా సీట్లు గెలుచుకున్నాయి.