
ముగిసిన పోలీస్ ఈవెంట్స్
57.3 శాతం ఉత్తీర్ణత
హనుమకొండ, వెలుగు : పోలీస్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించిన ఈవెంట్స్ మంగళవారం ముగిశాయి. డిసెంబర్ 8 నుంచి జరిగిన ఫిజికల్ ఈవెంట్స్ కోసం మొత్తం 24,612 మందికి హాల్ టికెట్స్ ఇష్యూ చేయగా.. 21,585 మంది ఈవెంట్స్ కు హాజరయ్యారు. ఇందులో వివిధ ఈవెంట్లలో సత్తా చాటిన 12,387 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఉత్తీర్ణతా శాతం 57.3 గా నమోదు అయింది. ఇందులో 3,283పైగా మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా, ఈవెంట్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంలో కృషి చేసిన పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్, టెక్నీకల్ టీమ్స్, మెడికల్ స్టాఫ్, పీఈటీలతో వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ సమావేశమయ్యారు. ఇన్నిరోజులు అందించిన సేవలకు గాను అందరినీ అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈవెంట్స్ విజయవంతం కావడంలో కీలకంగా నిలిచిన అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేశ్, ఏవో రామకృష్ణ తో పాటు ఏసీపీలు, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
‘కుటుంబ పాలనలో మంథని ఆగం
’కాటారం, వెలుగు: కుటుంబ పాలనలో మంథని నియోజకవర్గం ఆగమైందని పెద్దపల్లి జడ్పీ చైర్మ న్ పుట్ట మధు విమర్శించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో సావిత్రి బాయి ఫూలే జయంతి మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా పుట్ట మధు హాజరయ్యారు. బడుగు, బలహీన వర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మహిళా లీడర్లు ఈ ప్రోగ్రాం నిర్వహించారని చెప్పారు. మహనీయుల చరిత్రను ప్రజలకు వివరిస్తుంటే కొందరు గిట్టని వారు తనపై కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో మహి ళలు చదువుకోకుండా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుటుంబం అడ్డుపడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్‌నేత, జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గీతాబాయి, రాకేశ్ తదితరులున్నారు.
బ్రాహ్మణపల్లిలో కాటమయ్య బోనాలు
గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలో గౌడ కులస్తులు మంగళవారం కాటమయ్య బోనాలు నిర్వహించారు. చీఫ్ గెస్టుగా ఎంపీ కవిత హాజరై కాటమయ్య స్వామికి బోనం సమర్పించారు. అనంతరం ఆలయ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.3లక్షలు మంజూరు చేశారు.
స్టూడెంట్లు ఇష్టపడి చదవాలి
ఉత్తమ ఫలితాలు రావాలంటే స్టూడెంట్లు ఇష్టపడి చదవాలని ఎంపీ కవిత అన్నారు. మంగళవారం గూడూరు మండలంలోని కస్తూర్భా గురుకుల స్కూల్ ను ఆమె సందర్శించారు. రిజిస్టర్లు చెక్ చేసి, పిల్లలతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో తెలుసుకున్నారు. తరచూ కరెంట్ పోవడం వల్ల ఇబ్బందిగా ఉందని స్టూడెంట్లు చెప్పడంతో.. సోలార్ లైట్ల కోసం రూ.లక్ష మంజూరు చేశారు. స్టూడెంట్లు టైంను వృథా చేయకుండా చదువుకోవాలన్నారు.
ప్రతి నెలా పంచాయతీ నిధులు ఇస్తున్నం
పల్లె ప్రగతితో సత్ఫలితాలు: అరూరి రమేశ్
పర్వతగిరి, వెలుగు: పంచాయతీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నామని, పల్లె ప్రగతి ప్రోగ్రాం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్అన్నారు. మంగళవారం వరంగల్జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ, కల్లెడ, ముంజాలకుంట తండాలో రూ.3.60కోట్లతో నిర్మించిన రైతు వేదికలు, సీసీ రోడ్లు, విలేజ్ పార్కులు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, క్రీడాప్రాంగణం, మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణం తదితర డెవలప్ మెంట్పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఉత్తమంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు, మాజీ జడ్పీటీసీ రాములు, సర్పంచులు రాజు, శోభ, తహసీల్దార్ కోమి, ఎంపీడీవో సంతోష్ కుమార్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్, సొసైటీ చైర్మన్లు మనోజ్ గౌడ్, దేవేందర్, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతం, జితేందర్‌రెడ్డి తదితరులున్నారు.
బండి సంజయ్ ని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదు
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
హనుమకొండ సిటీ, వెలుగు : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డికి... బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్‌ని విమర్శించే స్థాయి లేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బైరి నరేశ్ మాటలను బండి సంజయ్ ఖండిస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నాయని విమర్శించడం సిగ్గుచేటన్నారు. మంగళవారం హంటర్ రోడ్డులోని బీజేపీ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడన్నారు. తెలంగాణను అప్పులపాలు జేసి, దేశాన్ని దోచుకోడానికి వెళ్తున్నాడని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అవినీతి, అక్రమ సంపాదనలో ముందున్నాడని ఆరోపించారు. 2009కి ముందు వినయ్‌భాస్కర్ ఆస్తులెన్నో.. ఇప్పుడున్న ఆస్తులెన్నో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మొలుగూరు భిక్షపతి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్ తదితరులున్నారు. అంతకుముందు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.
పరిహారం పంపిణీలో సర్కారు నిర్లక్ష్యం
భూపాలపల్లి అర్బన్, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్టులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పరిహారం అందక గ్రీవెన్స్ లోనే బాధితుడు సాంబయ్య ఆత్మహత్యకు ప్రయత్నించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కింది స్థాయి ఆఫీసర్ల నుంచి కలెక్టర్ వరకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా సాంబయ్యకు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. సాంబయ్య బీజేపీ కార్యకర్త కాబట్టే అధికార పార్టీ అండదండలతో సింగరేణి యాజమాన్యం పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా భూనిర్వాసితులందరికీ నష్టపరిహారం అందించాలని, లేదంటే ఉద్యమం తప్పదన్నారు. అలాగే ఇటీవల ఖాసీంపల్లిలో బీజేపీ నాయకులు ప్రజల శ్రేయస్సు కోసం బెంచీలు ఏర్పాటు చేస్తే.. వాటిని బీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేయడం నీతిమాలిన చర్య అని కీర్తిరెడ్డి ఫైర్ అయ్యారు.
కబ్జా చెరలోనే గుడికుంట
చెరువును ఆక్రమించుకుంటున్న బీఆర్ఎస్ లీడర్
పట్టించుకోని ఆఫీసర్లు
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములు గు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ సమీపంలోని గుడికుంట చెరువు కబ్జా చెరలోనే ఉంది. శిఖం భూమిపై కన్నేసిన ఓ అధికార పార్టీ లీడర్.. గుట్టుచప్పుడు కాకుండా మొరం పోస్తూ ఆక్రమించుకుంటున్నాడు. ఆఫీసర్లు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. హైవేకు ఆనుకుని ఉండే ఈ చెరువులో రూ.6కోట్ల విలువైన 2.5 ఎకరాలు భూమిని కబ్జా చేస్తున్నాడు. ఈ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా... రెండ్రోజులుగా రాత్రి వేళ మొరం పోస్తూ... చదును చేస్తున్నారు. ఇదేంటని కొందరు రైతులు నిలదీయగా.. తమకు ఆఫీసర్ల నుంచి క్లియరెన్స్ ఉందని చెప్తున్నారు. ఆఫీసర్లను వివరణ కోరగా.. తాము ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదని చెబుతున్నారు. పట్టపగలే గుడికుంట చెరువు మాయమవుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులు ఫిర్యాదు చేసినా, అర్జీని పక్కన పెట్టేశారు.
సీఐ, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
వరంగల్, వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక సీఐ, మరో ఇద్దరు ఎస్సైలను సీపీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గీసుకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియ, సుబేదారి ఎససై పున్నం చందర్ ఉన్నారు. ఓ కేసు విషయంలో పున్నం చందర్ అలసత్వం వహించగా.. మరో ఇష్యూలో వెంకటేశ్వర్లు, హరిప్రియ వ్యవహరించిన తీరు పోలీస్ పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది. రంగనాథ్ సీపీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఒకే సారి ముగ్గురిని సస్పెండ్ చేయడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.