సీతారామ ప్రాజెక్టుకు రిజర్వాయర్ 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ప్లాన్

సీతారామ ప్రాజెక్టుకు రిజర్వాయర్  10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ప్లాన్
  •     ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు 
  •     పంపింగ్ ​చేస్తే సాగర్ ​ఆయకట్టుకూ ప్రయోజనం 
  •     రూ.20 కోట్లు ఖర్చు చేస్తే 18 వేల ఎకరాలకు నీళ్లు   
  •     పాలేరు, ఖమ్మం, కోదాడ నియోజకవర్గ రైతులకు లబ్ధి

ఖమ్మం, వెలుగు :  సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్ ​ఏర్పాటు కానుంది. పాలేరు, ఖమ్మం, కోదాడ నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే విధంగా ఖమ్మం రూరల్​ మండలంలో కొత్త రిజర్వాయర్​ నిర్మించాలని అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​ వచ్చిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి దీనిపై కొంత క్లారిటీ ఇచ్చారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతో కలిసి కలెక్టరేట్​లో నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో పొంగులేటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు రూ.15 వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు డిజైన్ ​చేయకపోవడం చాలా పెద్ద తప్పన్నారు. 10 నుంచి 13 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్​ ఏర్పాటు చేయాలన్నారు. ఈ రిజర్వాయర్​ నిర్మాణం వల్ల సీతారామ ప్రాజెక్టు నుంచి పంపింగ్​ చేస్తే, సాగర్​ఆయకట్టుకు కూడా భారీ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు చేస్తే 18 వేల ఎకరాలకు నీటిని అందించవచ్చని పొంగులేటి అన్నారు. దీంతో ఆయన సూచనల మేరకు ఆఫీసర్లు రిజర్వాయర్ ​ప్రపోజల్​ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

రిజర్వాయర్ ​కెపాసిటీ10 టీఎంసీలకు పైనే...

ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు నుంచి పాలేరు, వైరా రిజర్వాయర్లకు గోదావరి నీటిని తరలించేందుకు​ కాల్వలు తవ్వుతున్నారు. ఇవి కాకుండా సత్తుపల్లి లింక్​ ద్వారా లంకాసాగర్​ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రపోజల్ కూడా ఉంది. అయితే, వీటిలో పాలేరు, వైరా రిజర్వాయర్ల​ పూర్తి స్థాయి సామర్థ్యం చెరో 2.5 టీఎంసీలు కాగా, లంకాసాగర్​ ప్రాజెక్టులో ఒక టీఎంసీ లోపు మాత్రమే నీటిని నిల్వ చేసే కెపాసిటీ ఉంది. దీంతో సీతారామ ద్వారా వచ్చిన గోదావరి నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే 10 టీఎంసీల కెపాసిటీకి మించి రిజర్వాయర్ ​ఉండాలని ప్లాన్​ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ ​మండలంలో అనువైన స్థలాన్ని గుర్తించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు మున్నేరుకు వరద వచ్చిన సమయంలో ఆ నీటిని డైరెక్టుగా పాలేరులోకి గ్రావిటీ ద్వారా తరలించేందుకు మరో లింక్​ కాల్వ ప్రపోజల్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మున్నేరు నుంచి డోర్నకల్​వైపు దాదాపు 9 కిలోమీటర్ల కాల్వ తవ్వడం ద్వారా..పాలేరు రిజర్వాయర్​కు వెళ్లే సీతారామ లింక్​ కెనాల్​అప్​స్ట్రీమ్​కు నీటిని గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే అవకాశముందని తేల్చారు. దీనిపై కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్​వస్తే పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ​ 

గతంలో రోళ్లపాడు దగ్గర ప్రపోజల్​

గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే రోళ్లపాడు దగ్గర రిజర్వాయర్​ నిర్మాణానికి ప్రపోజల్స్​పెట్టారు. 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని ప్లాన్​ చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఎత్తయిన ప్రాంతం కావడంతో అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపు ఈజీ అవుతుందని భావించారు. అయితే, టేకులపల్లి మండలం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, రోళ్లపాడు దగ్గర వన్యప్రాణి సంరక్షిత రిజర్వుడ్​ ఏరియా కూడా ఉండడంతో ఆ ప్రపోజల్​ను తొలగించారు. రోళ్లపాడు రిజర్వాయర్​ లేకుండానే సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మరోవైపు సీతమ్మ బ్యారేజీకి నేషనల్ గ్రీన్ ​ట్రిబ్యునల్​ నుంచి ఉన్న చిక్కుల కారణంగా మరో ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఒక రిజర్వాయర్​ నిర్మాణం కోసం ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.