వరాహరూపంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, వెలుగు : శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి వరాహరూపంలో దర్శనమిచ్చారు.  వరాహరూపంలో రామయ్యను తిలకించి భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గర్భగుడిలో స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తులను వరాహరూపంలో అలంకరించారు. అధ్యయనోత్సవంలో భాగంగా ప్రాకార మండపంలో వరాహ రామయ్యకు చతుర్వేద, రామాయణ ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రిక్షేత్రమహత్యం, నాళాయర దివ్యప్రబంధ పారాయణాలు చేశారు.

కోలాటాలు, రామనామ స్మరణలు, భజనలతో ఊరేగింపుగా వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైకి వరాహ రామయ్యను తీసుకెళ్లి అధిష్టించారు. అక్కడ పూజలందుకున్న స్వామి తాతాగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయానికి తిరువీధి సేవగా వెళ్లారు. స్వామికి మహిళలు పెద్ద ఎత్తున మంగళ నీరాజనాలు పలికి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి తిరిగి ఆలయానికి స్వామి చేరుకున్నారు.