సంక్రాంతికి ప్రజలు ఊర్లబాట..హైదరాబాద్​సగం ఖాళీ!

హైదరాబాద్​ సిటీ నెట్​వర్క్​, వెలుగు: సంక్రాంతికి ప్రజలు ఊర్లబాట పట్టడంతో.. హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు ఖాళీగా మారాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసించే ఏరియాలు బోసిపోతున్నాయి. 

కూకట్​పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్​, కుత్బుల్లాపూర్​ కేపీహెచ్​బీ తదితర ప్రాంతాల్లోని ఏపీ ప్రజలు ఇప్పటికే సొంతూళ్లకు పయనమయ్యారు. ఆయా ఏరియాల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. 

సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లు గత రెండు రోజులుగా ప్రయాణికులతో నిండిపోయాయి. ఎంజీబీఎస్​, జేబీఎస్​, కూకట్​పల్లి, ఆరామ్​ఘర్​, ఉప్పల్ రింగ్ రోడ్​, దిల్ సుఖ్​నగర్​, ఎల్బీనగర్​, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. 

హైదర్​నగర్​ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్​!​

శుక్రవారం రాత్రి కూకట్​పల్లి ఏరియా నుంచి దాదాపు 1,500 ప్రైవేటు ట్రావెల్​ సర్వీసులు ఆంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లాయి. ఈ బస్సులన్నీ ఇక్కడి నుంచి వెళ్లటానికి అర్ధరాత్రి 2.30 వరకు టైమ్​ పట్టింది.  

కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, మూసాపేట, హైదర్​నగర్​ ప్రాంతాల్లో ముంబై జాతీయ రహదారి ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆర్టీసీతో పాటు, ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు సర్వీసులు పెద్ద సంఖ్యలో అదనంగా నడపుతున్నప్పటికీ సరిపోవటం లేదు. 

దీంతో హైదర్​నగర్​ నుంచి మూసాపేట వరకు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్​ స్తంభించింది. ట్రాఫిక్​ పోలీసులు వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు చేపడ్తున్నారు. 

ఎల్బీనగర్ చౌరస్తా నుంచి సుష్మా చౌరస్తా వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వివిధ ట్రాన్స్ పోర్ట్ ల బస్ స్టాఫ్ పాయింట్స్ ఉండటంతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ, టీజీఎస్​ఆర్టీసీ పాయింట్స్ ఉండడంతో బస్సులు రోడ్ల మీద బారులు తీరుతున్నాయి.   ఉప్పల్ – వరంగల్​ ప్రధాన రహదారి రద్దీగా మారింది.