వరల్డ్​ పాపులేషన్​ ప్రాస్పెక్ట్స్​- 2024 ప్రకారం ఇండియా జనభా 145కోట్లు

వరల్డ్​ పాపులేషన్​ ప్రాస్పెక్ట్స్​- 2024 ప్రకారం ఇండియా జనభా 145కోట్లు

ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (యూఎన్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎకనామిక్ అండ్​ సోషల్​ అఫైర్స్​) రూపొందించిన వరల్డ్​ పాపులేషన్​ ప్రాస్పెక్ట్స్​–2024 నివేదిక ప్రకారం 2024లో భారత్​ జనాభా 145 కోట్లుగా ఉంది. ఆ తర్వాత 2054 నాటికి జనాభా సుమారు 169 కోట్లు చేరుకుంటుందని తెలిపింది. ఆ తర్వాత 2100 నాటికి భారత్​ జనాభా 150 కోట్లకు తగ్గుతుందని వెల్లడించింది. భారత్​లో 2060 నాటికి దేశ జనాభా సుమారు 170 కోట్లు పెరిగి ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని  ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కానీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యూఎన్​ఓ తెలిపింది.

2080 నాటికి ఆ జనాభా సుమారు 1030 కోట్లకు చేరుకుంటుందని రిపోర్టు తెలిపింది. 2080 తర్వాత మళ్లీ జనాభా తరుగుదల మొదలై, శతాబ్దం చివరికి ప్రపంచ జనాభా 1020 కోట్లకు చేరుకుంటుందని రిపోర్టు ద్వారా అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గత ఏడాది చైనాను ఇండియా దాటింది. అయితే, ఆ పొజిషన్​లోనే 2100 వరకు ఇండియా ఉంటుందని యూఎన్​ఓ రిపోర్ట్​ తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 2024లో 141 కోట్లుగా ఉంది. 2054 నాటికి ఈ జనాభా 121 కోట్లకు పడిపోతుందని, ఆ తర్వాత 2100 సంవత్సరం నాటికి 63.3 కోట్లకు పడిపోతుందని రిపోర్టు తెలిపింది. 2024 నుంచి 2054 మధ్య కాలంలో చైనా దేశ జనాభా 20.4 కోట్ల మేర పడిపోనున్నది.