సోనియా సాక్షిగా..నా జీతం ప్రజలకే..రూ.9 మాత్రమే తీసుకుంటా..

  •    మిగిలిన డబ్బులో ఒక్కో నెల ఒక్కో వర్గానికి ఇస్తా 
  •     వైఎస్ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నా 
  •     ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదాద్రి, వెలుగు : ‘తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ సాక్షిగా నా జీతం ఆలేరు ప్రజలకే ఇస్తా’ అని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రకటించారు. తనకు ప్రతి నెలా వచ్చే జీతంలో రూ. 9 మాత్రమే తీసుకొని మిగిలిన మొత్తాన్ని ప్రతి నెల ఒక్కో వర్గానికి అందజేస్తానని తెలిపారు. జీతాన్ని ప్రజలకు..జీవితాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తానన్నారు. డిసెంబర్​ నెల జీతంతో 6 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్​కు.. ఎగ్జామ్స్​ కోసం అవసరమైన సామగ్రిని కొనిచ్చానని చెప్పారు. 

యాదాద్రి జిల్లా భువనగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాల సెంటర్​ చైర్మన్​గా ఉన్న తనకు రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్​ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విధాలుగా అండగా నిలిచి, ఎమ్మెల్యే కావడానికి కారకులయ్యారన్నారు. రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఆయన కూడా జీతం తీసుకోకుండా పని చేశారని, అందుకే తాను కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలోని అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు , ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులు ఇలా ఒక్కో నెల ఒక్కో వర్గానికి తన జీతాన్ని ఖర్చు చేస్తానన్నారు.