- ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు
- వరల్డ్ కప్ ముందు టీమ్‌కు మిగిలింది ఐదు మ్యాచ్‌లే
- రా. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
గెబెహా : సౌతాఫ్రికా, ఇండియా తొలి టీ20 వర్షార్పణం కావడంతో ఇప్పుడు రెండు జట్లు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే రెండో టీ20లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే తొలి మ్యాచ్ మాదిరిగానే దీనికి కూడా వర్షం ముప్పు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ టీమ్ రేస్‌లో ఉండాలని భావించిన ఇండియా యంగ్‌స్టర్స్‌కు నిరాశ తప్పేలాలేదు.
ఎందుకంటే మెగా ఈవెంట్‌కు ముందు ఇండియాకు ఐదు టీ20లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కుర్రాళ్లను పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్‌కు కూడా ఈ చిన్న విండో సరిపోదు. కాబట్టి ఐపీఎల్ పెర్ఫామెన్స్ మరోసారి కీలకం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్‌లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కొచ్చు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ టాప్ ఆర్డర్ బాధ్యతలను మోయనున్నారు. వన్డేల్లోనూ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్‌కు ప్లేస్ కష్టమే. అప్పుడు కీపర్ కమ్ ఫినిషర్‌గా జితేశ్ శర్మ, రింకూ సింగ్‌తో కలిసి బాధ్యతలు పంచుకోనున్నాడు.
సౌతాఫ్రికా పిచ్‌లు అదనపు బౌన్స్‌కు అనుకూలం కాబట్టి టాపార్డర్ నిలబడితేనే భారీ స్కోరును ఆశించొచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఆడటం ఖాయం. అయితే రెగ్యులర్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది. ఆసీస్‌పై రాణించడం బిష్ణోయ్‌కి కలిసొచ్చే అంశం. పేసర్లుగా సిరాజ్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్ బరిలోకి దిగనున్నారు. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇండియా యంగ్ స్టర్స్ ఆశిస్తున్నారు.
కొత్త వారికే చాన్స్..
వరల్డ్ కప్ టీమ్‌ను ఎంచుకునే నేపథ్యంలో సౌతాఫ్రికాకు కూడా ఐదు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. కాబట్టి తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే టీమ్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండటం సఫారీలకు అతిపెద్ద బలం. పేస్ జోడీ మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికయ్యారు.
తొలి మ్యాచ్ జరగలేదు కాబట్టి ఇందులోనైనా రాణించి సెలెక్టర్ల దృష్టిలో ఉండాలని ఈ ఇద్దరు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీళ్లకు డోనోవాన్ ఫెరీరా, ఫెలుక్వాయో నుంచి పోటీ ఉంది. మార్‌క్రమ్ నాయకత్వానికి కూడా ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. ఓపెనింగ్‌లో హెండ్రిక్స్‌కు తోడుగా బ్రీట్జ్‌కేను ఆడించనున్నారు. కీపర్లుగా స్టబ్స్, క్లాసెన్‌లో ఒకరికే చాన్స్ ఉంది. లెఫ్టార్మ్ పేసర్ బర్గర్ అరంగేట్రం చేసే చాన్స్ ఉంది. కేశవ్, షంసీ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు.
జట్లు (అంచనా)
ఇండియా : సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, / గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ / రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్ : మార్‌క్రమ్ (కెప్టెన్), రజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్‌కే, ట్రిస్టాన్ స్టబ్స్/ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డొనోవాన్ ఫెరీరా, మార్కో జాన్సెన్ / ఫెలుక్వాయో, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రీ బర్గర్, షంసీ.