డమాస్కస్: సిరియా తాత్కాలిక ప్రధాన మంత్రిగా మొహమ్మద్ అల్ బషీర్ నియమితులయ్యారు. తిరుగుబాటుదారులు సిరియాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో బషర్ అల్ అసద్ 13 ఏండ్ల నియంతృత్వ పాలనకు తెరపడిన నేపథ్యంలో రెబెల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. అధికార బదిలీకి మాజీ ప్రధాని మొహమ్మద్ ఘాజీ అల్ జలాలీ పూర్తిగా సహకరించారు.
అంతకుముందు ఘాజీతో హయత్ తహ్రిర్ అల్ షామ్ (హెచ్ టీఎస్) చీఫ్, ఇస్లామిస్ట్ రెబల్ లీడర్ అబూ ముహమ్మద్ అల్ జులానీ అలియాస్ అహ్మద్ అల్ షర్రా సమావేశమయ్యారు. రెబెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే తాత్కాలిక ప్రభుత్వానికి పూర్తిగా అధికార బదిలీ చేస్తున్నామని జులానీకి ఘాజీ స్పష్టం చేశారు.
కాగా.. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ హయాంలో ప్రజలను బంధించి, చిత్రహింసలకు గురిచేసిన అధికారులను తమ ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసి తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్ టీఎస్ చీఫ్ అబూ ముహమ్మద్ అల్ జులానీ తెలిపారు. మంగళవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ‘‘అసద్ హయాంలో అమాయక ప్రజలను పట్టుకుని క్రిమినల్స్, హంతకులు ప్రత్యక్ష నరకం చూపారు. వారిని వేధించుకు తిన్నారు. అలాంటి వారిని వదలబోం” అని జులానీ చెప్పారు.
ఇంజినీర్, విద్యావేత్త.. బషీర్
తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ అల్ బషీర్.. సిరియాలోని ఇద్లిబ్ గవర్నేట్ (ప్రావిన్స్ లాంటిది) లో జబల్ జావియా ప్రాంతంలోని ఓ గ్రామంలో 1983లో జన్మించారు. 2007లో అలెప్పో యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. హెచ్ టీఎస్ నేతృత్వంలోని పాలకపక్షంలో కీలకంగా వ్యవహరించిన బషీర్.. 2021లో ఇద్లిబ్ యూనివర్సిటీ నుంచి షరియా అండ్ లా డిగ్రీ అందుకున్నారు.