20 కోట్లకుపైగా బకాయిలు.. ఆందోళన బాటలో సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో బిల్లులు పెండింగ్​లో ఉండడంతో సర్పంచులు ఆందోళన బాట పడుతున్నారు. ఫండ్స్​ రాకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందంటూ వాపోతున్నారు. గ్రామాల్లో తిరుగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీలకు రూ. 20 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని సర్పంచులు చెబుతున్నారు.

పేరుకుపోతున్న బకాయిలు..

జిల్లాలో 481 పంచాయతీలు ఉన్నాయి. 8 నెలలుగా ఎస్ఎఫ్​సీ, ఎఫ్ఎఫ్​సీ నిధులు రాకపోవడంతో సర్పంచులు అప్పులు చేస్తూ గ్రామాల్లో పనులు చేస్తున్నారు. తమ పంచాయతీకి రూ. 9లక్షలు రావాల్సి ఉందని శేషగిరి నగర్​ సర్పంచ్​ తెలపగా, తమకు రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉందని పాత అంజనపురం సర్పంచ్​ వాపోయారు. తమకు రూ.8 లక్షలకు పైగా నిధులు రావాల్సి ఉందని అశోక్​ నగర్​ సర్పంచ్​ తెలిపారు. ఇలా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్మశాన వాటికలు, క్రీడా మైదానాలు, పల్లె ప్రకృతి వనాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్​ ఈఎంఐలు, మల్టీపర్పస్​ వర్కర్ల జీతాలతో పాటు పలు అభివృద్ధి పనులకు సర్పంచులు అప్పులు చేసి ఖర్చు పెట్టారు.

6 నుంచి 8 నెలలుగా ఫండ్స్​ రిలీజ్​ కాకపోవడంతో తెచ్చిన అప్పులకు ప్రతి నెలా వడ్డీ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. చిన్నచిన్న కారణాలతో ‌‌‌‌తమతో పాటు సెక్రటరీలను కలెక్టర్, డీపీవో, జడ్పీ సీఈవో తదితర అధికారులు బెదిరిస్తుంటారని, నిధులు లేకుండా పనులు ఎట్లా చేస్తారనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించి నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 

మున్సిపాలిటీల్లోనూ ఫండ్స్ కొరత 

ప్రతి నెలా మున్సిపాలిటీలో జనాభాను బట్టి ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​ చేస్తుంది. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు మూడు నెలలుగా పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ఒక్కో మున్సిపాలిటీకి రూ. 40 లక్షల నుంచి రూ. 60లక్షలు రావాల్సి ఉంది. ఫండ్స్​ రిలీజ్​ కాకపోవడంతో కాంట్రాక్టర్లు పట్టణంలో పనులు చేసేందుకు వెనకాడుతున్నారు. కమిషనర్లు, చైర్మన్లు కాంట్రాక్టర్లతో పాటు కౌన్సిలర్లతో మాట్లాడి పనులు చేపించాల్సి వస్తోంది. 

పక్క పంచాయతీ నుంచి అప్పు తెచ్చా..

అత్యవసర పనుల కోసం మా పంచాయతీలో డబ్బులు లేక పక్క పంచాయతీ నుంచి రూ. 54 వేలు అప్పు తెచ్చా. ఆరు నెలలుగా నిధులు రావడం లేదు. చేసిన పనులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా నిధులు రిలీజ్​ చేయాలి. లేకపోతే చిన్న పంచాయతీలు అభివృద్ధి కావు. -  రాందాస్, సర్పంచ్, మాల బంజర

రూ.24 లక్షలు రావాలి

మా పంచాయతీకి రూ. 24 లక్షలు రావాల్సి ఉంది. 8 నెలలుగా నిధులు రావడం లేదు. అప్పులు చేసి పనులు చేశాం. తెచ్చిన డబ్బులకు ప్రతి నెలా వడ్డీ కట్టాల్సి వస్తోంది. చెక్కులు పాస్​ కావడానికి నాలుగు నెలలు పడుతుండడంతో తిప్పలు పడుతున్నాం.  - బండ వెంకటేశ్వర్లు, సర్పంచ్, హేమచంద్రాపురం