సీఐ స్వర్ణలత కేసులో ‘సినిమా’ను మించిన అదిరే ట్విస్టులు

విశాఖకు చెందిన మహిళా రిజర్వు ఇన్ స్పెక్టర్ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన ఏఆర్ఐ స్వర్ణలత అరెస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆమె వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే పోలీసు డిపార్ట్ మెంటే ముక్కున వేలు వేసుకుంటోంది. ఒంటిపై ఉన్న ఖాకీ డ్రెస్ ను అడ్డం పెట్టుకొని బెదిరింపులు, డబ్బు వసూళ్లు, బ్లాక్ దందాలు..ఇవన్నీ స్విల్వర్ స్క్రీన్ పై మెరిసిపోవాలన్న డ్రీమ్ కోసమే స్వర్ణలత చేసినట్టు విచారణలో బయటపడింది.

బాధ్యత గల విధుల్లో ఉండి నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్‌డ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ‘ఏపీ 31’ సినిమాలో నటిస్తోంది స్వర్ణలత. ఏఆర్‌ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో ఆమెపై అనేక ఆరోపణలు వచ్చాయి. తర్వాత విజయవాడ బదిలీ చేశారు. కొంతకాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. అక్కడ కూడా పని చేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండటంతో వైసీపీ నేతల సిఫార్సులతో నగరానికి వచ్చారు. 

కొంతకాలం సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసి.. ఆ తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా బాధ్యతలు చేపట్టారు. హోంగార్డుల నిర్వహణ విషయంలోనూ స్వర్ణలత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సినిమాల్లో నటించాలని స్వర్ణలతకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. కొన్ని సినిమా పాటలకు స్టెప్పులు కూడా వేసి, వార్తల్లో నిలిచారు. చిరంజీవి నటించిన ఓ సినిమాలోని పాటకు డ్యాన్స్‌ చేసి చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశారు. 

ఒక ప్రజాప్రతినిధి తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకోసం డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పటంతో ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన డ్యాన్సులకు సంబంధించిన వీడియోలను తీయించారు స్వర్ణలత. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో స్వర్ణలతకు కొంతమంది వైసీపీ నేతలతో పరిచయాలు పెరిగాయి. గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆమెకు బంధువైన ఓ మహిళా అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లుగా కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. 

గతేడాది టీడీపీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలి హోదాలో పంచ్‌ డైలాగ్స్‌తో విరుచుకుపడ్డారు. పోలీసులకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడుతున్నారంటూ ప్రెస్‌మీట్‌లో అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నోట్ల మార్పిడి కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో స్వర్ణలతపై కేసు పెట్టకుండా ఆమెకు సన్నిహితుడైన ఓ కీలక ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. తన వల్ల కాదని తేలడంతో ఆయన వైసీపీ  ముఖ్య నేతలను అభ్యర్థించి ఆమెపై కేసు తీవ్రతను తగ్గించేలా ఒత్తిళ్లు తెచ్చారంటే స్వర్ణలత  రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఏపీ 31’ సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ స్వర్ణలత భాగస్వామి అయినట్లు సమాచారం. సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరం పడడంతో నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా.. ? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అంతేకాదు.. స్వర్ణలతకు కొందరు రియల్టర్లతోనూ పరిచయాలున్నాయి. కమీషన్‌ తీసుకుని ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్‌ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వర్ణలత కేసు ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ప్రకంపనలు రేపుతోంది.