నలుగురు రైతుల ఆత్మహత్యాయత్నం

జనగామ/సూర్యాపేట/గద్వాల, వెలుగు:  ధరణి పోర్టల్ వచ్చినా భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఎప్పట్లాగే  ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణికి క్యూ కడ్తున్నారు. కలెక్టర్లకు అర్జీలు పెట్టుకొని నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక కలెక్టరేట్లలోనే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. సోమవారం సూర్యాపేట, జనగామ, గద్వాల కలెక్టరేట్లలో నలుగురు బాధితులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆఫీసర్లు, పోలీసులు అడ్డుకున్నారు. నెలల తరబడి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఈ ప్రజావాణి ఎందుకని బాధితులు ప్రశ్నించారు.  రెవెన్యూ ఆఫీసర్లు తమ భూములను ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ యువరైతు జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. 

తమ భూములను తిరిగి తమ పేరిట పట్టా చేయాలని, లేకపోతే నిప్పంటించుకుని చనిపోతానని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో న్యాయం చేస్తామని ఆర్డీఓ మధుమోహన్ హామీ ఇవ్వడంతో బిల్డింగ్ పై నుంచి రైతు దిగివచ్చాడు. బాధితుడి కథనం ప్రకారం.. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిమ్మల నర్సింగరావుకు 7.29 ఎకరాలు, నిమ్మల లక్ష్మయ్యకు 7.20 ఎకరాల భూమి వంశపారంపర్యంగా వచ్చింది. గతంలోనే వీరు ఇతర ప్రాంతాలకు వలస పోగా.. వీరి భూములను దాయాదులు అక్రమంగా పట్టా చేయించుకున్నారు. తమకు న్యాయం చేయాలని నిరుడు డిసెంబర్​లోనూ కలెక్టరేట్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా న్యాయం చేస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారని, కానీ నేటి వరకూ పరిష్కరించలేదని బాధితుడు నర్సింగరావు చెప్పాడు. మరోవైపు వీఆర్ఓ ఫోన్​ చేసి భూమి మీద అడుగు పెట్టగలుగుతవా? అని బెదిరిస్తున్నడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

భూముల కబ్జా, పోలీసులు వేధిస్తున్నారని.. 

కొందరు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు కబ్జాదారులతో కుమ్మక్కై తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఓ మహిళా రైతు, మరో యువరైతు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. బాధితుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన మీసాల జానయ్య కుటుంబానికి 1.24 ఎకరాల భూమిని బెజ్జం వెంకన్న, మీసాల సైదులు అనే వ్యక్తులు కబ్జా చేశారు. జానయ్య కూతురు మీసాల స్వాతి కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే, పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, కొందరు లీడర్లు కుమ్మక్కై కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని, తమపైనే ఉల్టా కేసులు పెట్టి బెదిరిస్తున్నారని బాధితురాలు చెప్పారు.

తమను అర్ధరాత్రి వరకూ స్టేషన్​లోనే ఉంచారని ఆరోపించారు. కలెక్టరేట్‌లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ తన కొడుకు సైదులుతో ప్రజావాణికి హాజరైంది. వీరికి ఉన్న 2.20 ఎకరాల భూమిని నలుగురు కబ్జా చేశారని, పోలీసులు పట్టించుకోవడంలేదని కలెక్టర్​కు ఫిర్యాదు చేయడానికి వస్తే ఎస్పీ వద్దకు వెళ్లాలని చెప్పారు. అప్పటికే మీసాల స్వాతి పెట్రోల్ పోసుకుంటుండటంతో  పున్న సైదులు కూడా అదే పెట్రోల్ బాటిల్ తీసుకుని పోసుకునేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు.

భూమి ఉన్నా పట్టా ఇస్తలేరని..  

సాదా బైనామాలకు సర్కారు పట్టాలివ్వకపోవడం వల్ల తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి పోతోందనే ఆవేదనతో మరో యువ రైతు గద్వాల కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు పెట్రోల్ డబ్బా లాక్కొని నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. బాధితుడి కథనం ప్రకారం.. గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన బోయ లోకేశ్ కుటుంబానికి 6.07 ఎకరాల భూమి ఉంది. 1953లో ఆ భూమిని తన తాత సాదాబైనామా కింద కొన్నాడు. సాదాబైనామా కింద పట్టా కోసం వీరు అప్లై చేయగా.. భూమి వాళ్ల పేరు మీద లేదని తెలుసుకున్న లక్ష్మాగౌడ్ అనే వ్యక్తి రికార్డుల్లో అక్రమంగా తన పేరును ఎక్కించుకున్నాడు. దీనిపై 8 సార్లు ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు ఇచ్చినా న్యాయం చేయడంలేదని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు చెప్పాడు.