ప్రమాదకరంగా నాగార్జునసాగర్‌‌ ఎడమకాల్వ కట్ట

  • కుర్యాతండా, అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద కోతకు గురైన మట్టి
  • ఫుల్‌‌ ఫ్లో వస్తే గండి పడే ప్రమాదం

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని నేరెళ్లగూడెం మేజర్‌‌ వద్ద నాగార్జునసాగర్‌‌ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడడంతో ఇప్పుడు మిగతా చోట్ల కాల్వ కట్ట పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో 178.250 కిలోమీటర్లు ఉన్న ఈ కాల్వ కట్ట అక్కడక్కడా కోతకు గురికావడంతో ఎప్పుడు గండి పడుతుందోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్వ పరిధిలో మొత్తం 83 హై లెవల్‌‌ బ్రాంచ్‌‌ కెనాల్స్‌‌, మేజర్‌‌ కాల్వలు ఉన్నాయి. మిర్యాలగూడ మండలం కుర్యా తండా అండర్‌‌ టన్నెల్‌‌, అన్నపురెడ్డిగూడెం, యాద్గార్‌‌పల్లి మేజర్‌‌ సమీపంలో ఎడమ కాల్వ కోతకు గురైంది.

అక్కడక్కగా సీసీ లైనింగ్‌‌ వేయకపోవడంతో కాల్వ కట్ట బలహీనపడింది. ఈ కట్ట కింద 8 వేల నుంచి 10 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కట్టపై వడ్ల లోడ్‌‌ ట్రాక్టర్లు తిరుగుతుండడంతో ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎడమ కాల్వ పూర్తిస్థాయి నీటి విడుదల సామర్ధ్యం 12 వేల క్యూసెక్కులు కాగా రెగ్యులర్‌‌గా 6 వేల నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కాల్వలో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే కట్టకు గండి పడే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.