అదే బాటలో కన్సల్టింగ్ కంపెనీలు కూడా
బిజినెస్ డెస్క్, వెలుగు : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వివిధ సెక్టార్లలోని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించుకుంటున్నాయి. కొన్ని సెక్టార్లలోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండగా, మరికొన్ని సెక్టార్లలోని కంపెనీలు మాత్రం మొత్తం ఉద్యోగులందరినీ ఆఫీస్‌లకు పిలుస్తున్నాయి. టెలికం అండ్ కన్సల్టింగ్ సెక్టార్‌లోని కంపెనీలు తమ ఉద్యోగుల్లో 75 శాతం నుంచి 100 శాతం మందిని తిరిగి ఆఫీస్‌లకు రప్పించుకుంటున్నాయని కొలియర్స్–ఆఫిస్ సర్వే వెల్లడించింది. ఐటీ సెక్టార్‌లోని కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఇప్పటిలో ఆఫీస్‌లకు రమ్మనడం లేదని వివరించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కంపెనీ కొలియర్స్ ఇండియా, కో–వర్కింగ్ ఆపరేటర్ ఆఫిస్ కలిసి ఈ సర్వే చేశాయి. ‘కరోనా థర్డ్‌వేవ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి తగ్గుతూ వస్తోంది. దీంతో ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌లకు రావడం పెరిగింది. ఫలితంగా ఈ ఏడాది జూన్ నాటికి 34 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో 75 శాతం నుంచి 100 శాతం మందిని (ఇందులో హైబ్రిడ్ విధానం కింద ఆఫీస్‌కు వచ్చేవారు కలిసి ఉన్నారు) తిరిగి ఆఫీస్‌లకు హాజరవ్వమంటున్నాయి’ అని ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం 41 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లోని 25 శాతం మందిని మాత్రమే ఆఫీస్‌లకు పిలుస్తున్నాయి.
ఈ‑కామర్స్‌లోనూ తక్కువే..
ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పిస్తున్న కంపెనీల్లో మధ్య స్థాయి కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని కొలియర్స్–ఆఫిస్ సర్వే వెల్లడించింది. ఈ–కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో తక్కువ మందిని మాత్రమే తిరిగి ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. సుమారు 80 శాతం ఈ–కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగుల్లోని 50 శాతం మంది వరకు మాత్రమే తిరిగి ఆఫీస్‌లకు రావాలని ఆదేశించాయి. మరోవైపు వర్క్‌స్పేస్‌కు సంబంధించి కూడా కొలియర్స్–ఆఫిస్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం, 53 శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ ..రెండు విధానాలకు మొగ్గు చూపుతున్నాయి. తమ వర్క్‌స్పేస్ పోర్టుఫోలియోని విస్తరించాలని అనుకుంటున్నాయి. 49 శాతం కంపెనీలు మాత్రం ఫ్లెక్స్ వర్క్‌స్పేస్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్లెక్స్ స్పేస్ అంటే సాధారణ ఆఫీస్‌లలో ఉండేటట్టు ఉద్యోగులకు డెస్క్‌లు వంటివి ఫిక్స్‌డ్‌గా ఉండవు. ఉద్యోగులు తమ వర్క్‌కు తగ్గట్టు ఆఫీస్‌లోని ప్లేస్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లెక్స్ స్పేస్‌లకు డిమాండ్ పెరగుతోందని, మెట్రో, నాన్ మెట్రో సిటీలలో ఇటువంటి టైప్ ఆఫీస్‌లను కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయని కొలియర్స్–ఆఫిస్ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్లెక్స్ సెంటర్లను ఆపరేట్ చేసేవారు మొత్తం 35 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజ్‌కు ఇచ్చారు. వర్క్ స్పేస్‌ను మరింత మెరుగ్గా వాడుకునేందుకు ఫ్లెక్స్ స్పేస్ విధానానికి కంపెనీలు షిఫ్ట్ అవుతున్నాయని ఈ సర్వే వెల్లడించింది.
సీఈఓలు, ఫౌండర్ల నుంచి అభిప్రాయాలు..
ఏయే సెక్టార్లలోని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయో అంచనావేయడానికి కొలియర్స్, ఆఫిస్ ఈ సర్వేను నిర్వహించాయి. దీంతో పాటు తమ వర్క్ స్పేస్‌ను మరింత సమర్ధవంతంగా వాడుకోవడానికి కంపెనీలు ఎటువంటి టైప్ వర్క్‌స్పేస్ మోడల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నాయో విశ్లేషించాయి. ఈ సర్వేను ఈ ఏడాది మే–జూన్ మధ్య జరిపారు. ఐటీ, ఐటీ రిలేటెడ్ సెక్టార్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్‌ఐ), ఇంజినీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఇతర సెక్టార్లలోని కంపెనీల నుంచి అభిప్రాయాలను ఈ సర్వే కోసం తీసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ఫౌండర్లు, సీఈఓలు, సీఓఓలు, చీఫ్ హెచ్‌ఆర్‌ఓలు వంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో పనిచేసే సుమారు 150 మంది నుంచి అభిప్రాయాలనుసేకరించి ఈ సీ–సూట్ సర్వేను నిర్వహించామని కంపెనీ చెబుతోంది. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 1–500 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు, 10 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలూ ఉన్నాయని కొలియర్స్– ఆఫిస్ వెల్లడించాయి.