-
భక్తుల రాక తగ్గడంతో ఆలయ ఖజానాకు గండి
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పడింది. వర్షాల కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయ పరిసరాలు వెలవెలబోయాయి. భక్తులతో కిక్కిరిసే దర్శన, ప్రసాద క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ప్రదేశం, అన్నదానసత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్ బే ప్రాంగణం, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఊహించని విధంగా తగ్గిపోయింది. భక్తుల రాక తగ్గడంతో ఆలయ ఖజానాకు భారీగా గండి పడింది.
భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.21,09,091 ఆదాయం మాత్రమే వచ్చింది. ఇందులో నిత్య పూజలతో సంబంధం లేని లీజెస్ ద్వారా రూ.5,81,181 ఇన్ కమ్ వచ్చింది. అంటే ఆలయానికి వచ్చిన ఆదాయంలో లీజెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పక్కనపెడితే.. నిత్య పూజల ద్వారా కేవలం రూ.15,27,910 ఆదాయం మాత్రమే
సమకూరింది.