తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్​

  • కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్​లో అమ్మకాలు 
  • గుంటూరు, మహారాష్ట్రలోని గడ్చిరౌలి నుంచి మిర్చి విత్తనాలు తెచ్చుకుంటున్న రైతులు
  • పనిలో పనిగా నకిలీ విత్తనాలు అంటగడుతున్న దళారులు 
  • నష్టపోతున్న అన్నదాత

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ వెంకటాపురం, వెలుగు : రాష్ట్రంలో విత్తనాలు దొరక్కపోవడంతో ఆంధ్రా, మహారాష్ట్రల నుంచి రైతులు మిర్చి విత్తనాలు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. పురుగుల మందులు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు. -మిర్చి రైతులు ఎక్కువగా ఇష్టపడే విత్తనాలు మన రాష్ట్రంలో దొరకకుండా కృత్రిమ కొరత సృష్టిస్తుండడంతో రైతులు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి బ్లాక్ మార్కెట్లో ఈ విత్తనాలను కొనుక్కుని వస్తున్నారు.

ఇదే అదనుగా దళారులు నకిలీ విత్తనాలు తీసుకువచ్చి గ్రామాల్లోని రైతులకు అంటగట్టి నట్టేట ముంచుతున్నారు. ఈ దందా ఆపాల్సిన వ్యవసాయ శాఖ ఆఫీసర్లు మామూళ్ల మత్తులో తూగుతున్నారు.  

100 గ్రాముల విత్తనాలకు రూ.10 వేలకు పైనే.. 

గోదావరి పరివాహక ప్రాంతం అధికంగా ఉండే భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నల్లరేగడి నెలల్లో రైతులు వాణిజ్య పంట అయిన మిర్చి అధికంగా సాగు చేస్తారు. ప్రతి యేటా ఈ మూడు జిల్లాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. ఎకరం భూమిలో మిర్చి సాగుకు 150 నుంచి- 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. 10 గ్రాముల మిర్చి విత్తన ప్యాకెట్ ఎమ్మార్పీ రూ.650 ఉండగా వీటిని రూ.950 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు.

అయినా కూడా కృత్రిమ కొరత సృష్టిస్తుండడంతో రైతులు బ్లాక్​లో కొనాల్సిన దుస్థితి దాపురించింది. ఇదే అదనుగా కొందరు దళారులు నకిలీ విత్తనాలు తయారుచేసి అధిక ధరలకు అమ్ముతుండడంతో దిగుబడి రాక రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి వస్తున్న సీడ్‌‌‌‌ 

రాష్ట్రంలో మిర్చి విత్తనాలు దొరకకుండా కృత్రిమ కొరత సృష్టించడంతో రైతులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి మరీ మిర్చి విత్తనాలు తెచ్చుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, పలిమెల, మహాముత్తారం మండల రైతులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని బెస్తగూడెం, ఉప్పేడు, వీరాపురం

పాత్రపురం గ్రామాలకు చెందిన రైతులు, వాజేడు మండలం ధర్మారం, పేరూరు గ్రామానికి చెందిన వారు మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లా సిరివంచకు, ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు వెళ్లి మిర్చి విత్తనాలు కొని తెచ్చుకుంటున్నారు. 

డిస్ట్రిబ్యూటర్ల ఇష్టారాజ్యం

రైతులు యూఎస్–​341 రకం మిర్చి విత్తనాలను అధికంగా కొంటుంటారు. గతంలో యూఎస్–341 విత్తనాల్లో జన్యుపరమైన లోపాలుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమ్మకాలు నిషేధించింది. అయితే, ప్రస్తుతం వీటికి మళ్లీ అనుమతులు ఇవ్వడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాజేడు గ్రామానికి చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ డీలర్లకు విత్తనాలు ఇవ్వకుండా బ్లాక్ చేసి..నేరుగా రైతులకే అధిక ధరలకు అమ్ముతున్నాడు.  

10 గ్రాముల ప్యాకెట్ కు రూ.వెయ్యి పెట్టినా దిక్కులేక రైతులు కొనాల్సి వస్తోంది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన మిర్చి విత్తన డిస్ట్రిబ్యూటర్లలో కొందరు బ్లాక్‌‌‌‌లో విత్తనాలుమ్ముతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ దందా అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వీరి దగ్గర మామూళ్లు తీసుకుని సైలెంట్‌‌‌‌గా ఉంటున్నారు.  

బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ దందా అరికడతాం..!  

మిర్చి విత్తనాలు బ్లాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో అమ్మకుండా చర్యలు తీసుకుంటాం. మిర్చి నారు పోసే  నాటికి విత్తనాలు అందుబాటులోకి తెస్తాం. ఆగస్టు నాటికి విత్తనాలన్నీ షాపుల్లో ఉండేలా చేస్తాం. ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకున్న డీలర్ వద్దనే బిల్లు తీసుకొని మిర్చి విత్తనాలు కొనాలి. విత్తనాలు మొలకెత్తకపోయినా..నాణ్యతాలోపం ఉన్నా కంపెనీ నుంచి నష్టపరిహారం తీసుకొనే వీలుంటుంది. 

‒ జి నరసింహారావు, వ్యవసాయ శాఖ ఆఫీసర్‌‌‌‌, వెంకటాపురం, ములుగు జిల్లా 

విత్తనాలు దొరక్కే పక్క రాష్ట్రాలకు పోతున్నాం

పోయినేడాది నేను రూ.8 వేలు ఎక్కువ పెట్టి ఎకరానికి సరిపడా మిర్చి విత్తనాలు కొన్నా. యూఎస్–​341 రకం మిర్చి విత్తనాలు మా ప్రాంతంలో దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లి కొనుక్కొస్తున్నాం. డీలర్లు, విత్తనాల షాప్ యజమానులు సిండికేట్ అయి.. విత్తనాలు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో సీజన్​లో విత్తనాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో రైతులు ఈ సారి ముందుగానే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వెళ్లి విత్తనాలు కొనుక్కువచ్చారు.,

‒ బొల్లె వెంకటేశ్వర్లు, రైతు, వాజేడు మండలం 

ప్రభుత్వమే అందజేయాలి 

నాణ్యమైన మిర్చి విత్తనాలను ఎమ్మార్పీ ధరలకు రైతులకు అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రతి యేటా నష్టాల పాలవుతున్నాం. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే యూఎస్​–341 రకం మిర్చి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా...అన్ని దుకాణాలకు చేరే విధంగా వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.  

‒చిట్టెం ఆదినారాయణ, వెంకటాపురం రైతు