పలుచోట్ల 9 డిగ్రీల దాకా నమోదు
ఆదిలాబాద్/సంగారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలు, నగరవాసులు కూడా వణుకుతున్నారు. తెలంగాణ కాశ్మీరంగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కప్పేస్తున్నది. అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల 9 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గాంధారి మండలం రామ్ లక్ష్మణ్ పల్లిలో 9.7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న సంగారెడ్డి లాంటి జిల్లాల్లోనూ ఉదయం 8 దాకా మంచు వీడడం లేదు. ఆదిలాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కుమ్రం భీం , మేడ్చల్, సిద్దిపేట, నిజామాబాద్, నారాయణపేట, యాదాద్రి జిల్లాలో సగటున 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గురుకులాలు, హాస్టళ్లలో ఉండి చదువుతున్న స్టూడెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. కిటికీలకు తలుపులు లేక, కప్పుకునేందుకు సరైన దుప్పట్లు లేక వణుకుతున్నారు. గీజర్లు లేకపోవడంతో చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది. చలికి తోడు పొగమంచు కారణంగా రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచు కారణంగా ఉదయం 8 గంటల దాకా ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలకు ఉదయం పొగమంచే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, మంచు పోయే దాకా వాహనాలు నడపవద్దని ఆర్టీఏ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.