యమున ఉగ్రరూపం..
భయం గుప్పిట్లో ఢిల్లీ
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
రికార్డ్ స్థాయిలో ఉప్పొంగుతున్న నది
పంజాబ్, హర్యానాలో తెరిపిచ్చిన వాన
ఆల్ టైం రికార్డ్ స్థాయిలో ఉప్పొంగుతున్న నది
ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 208.5 మీటర్లకు చేరిన నీటి మట్టం
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు.. 144 సెక్షన్ విధింపు
ఉత్తరాఖండ్, హిమాచల్ లో మరో రెండు రోజులు భారీ వానలు
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల జనం భయంతో వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు, పై రాష్ట్రాల నుంచి నీటి ప్రవాహం భారీగా వస్తుండటంతో యమునా నదిలోకి భారీగా వరద చేరుతున్నది. యమున నుంచి వరదలు ముంచెత్తే ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా వరదలు వచ్చే ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టారు. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం బుధవారం రాత్రికి 208.5 మీటర్లకు చేరింది. ఇది ఆల్ టైం రికార్డ్. మరోవైపు ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కొంత తెరపినిచ్చాయి.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉండటం తో అక్కడి లోతట్టు ప్రాంతాల జనం భయంతో వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు, పై రాష్ట్రాల నుంచి నీటి ప్రవాహం భారీగా వస్తుండటంతో యమునా నది ఢిల్లీలో మహోగ్రరూపం దాల్చింది. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఢిల్లీలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, పార్కులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడు యమున ఉగ్రరూపంతో మరింత ముప్పు ఏర్పడింది. వరదలు ముంచెత్తే ప్రాంతాలను ఖాళీ చేయించామని, ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించామని ప్రకటించారు.
రికార్డ్ స్థాయిలో నీటిమట్టం
సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) పోర్టల్‌లోని సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం సమయానికి 207.55 మీటర్లకు చేరింది. ఇది ఆల్ టైం రికార్డ్. చివరిసారిగా 1978లో నదిలో ఇక్కడ 207.49 మీటర్ల నీటి మట్టం నమోదైంది. యమునా నదిలో నీటి మట్టం ఇంకా పెరిగే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. నీటి మట్టం ఆదివారం 203.14 మీటర్లు ఉండగా, సోమవారం సాయంత్రానికి డేంజర్ మార్క్ (205.33 మీటర్లు) దాటి 205.4 మీటర్లకు చేరింది. అదేరోజు రాత్రికి 206 మీటర్లు కూడా దాటడంతో నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీళ్లు చేరాయి.బుధవారం సాయంత్రం 4 గంటలకు నదిలో నీటి మట్టం 208.5 మీటర్లకు పెరిగింది.
నది పూడుకుపోవడం వల్లే..?
ఢిల్లీలో యమునా నదిపై 22 కిలోమీటర్ల పరిధిలోనే 20 బ్రిడ్జిలు, 3 బ్యారేజీలు ఉన్నాయి. వీటి వద్ద పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. చాలాచోట్ల పూడిక వల్ల నది మధ్యలో ఇసుక మేటలు ఏర్పడ్డాయని, ప్రధానంగా సిగ్నేచర్ బ్రిడ్జి, ఐటీవో బ్యారేజ్ మధ్య నది పెద్ద ఎత్తున పూడుకుపోవడం వల్లే వరదల ముప్పు ఏర్పడిందని అంటున్నారు. 1978లో నదిలో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరినప్పుడు 7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైందని, కానీ ఇప్పుడు 3.59 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికే నీటి మట్టం 207.55 మీటర్లకు చేరిందని పేర్కొంటున్నారు. ఢిల్లీ వద్ద నది పూడుకుపోవడమే ప్రధాన సమస్య అని స్పష్టం చేస్తున్నారు.
ముమ్మరంగా రెస్క్యూ పనులు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు కొంత తగ్గడంతో రెస్క్యూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఉత్తరాఖండ్‌లో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ లోని కసోల్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 2 వేల మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు. ఈ సీజన్ లో వర్షాల కారణంగా 80 మంది చనిపోయారన్నారు.
లోతట్టు ప్రాంతాల నుంచి వెంటనే ఖాళీ చేయండి
ఢిల్లీలో యమున ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని, ఆయా ప్రాంతా ల ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం విజ్ఞప్తి చేశా రు. సెల్ఫీలు దిగేందుకు, నదిని చూసేందు కు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. బుధవారం మంత్రులు, ఉన్నతాధికారుల తో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించిన తర్వా త ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు ప్రారంభించామని చెప్పారు. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదలడం వల్లే యమునలో నీటి మట్టం పెరిగిందన్నారు. ‘‘ఈ విషయంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో మాట్లా డాను. హత్నికుండ్ వద్ద నీటిని నిల్వకు అవకాశంలేదని, హిమాచల్ నుంచే నీటి విడుదలను తగ్గించామని షెకావత్ చెప్పారు. అయితే, యమునా నది ప్రవాహం తగ్గేందుకు ఇంకొంత టైం పడుతుంది” అని కేజ్రీవాల్ మీడియాకు వివరించారు.