ఎల్​కేజీ, యూకేజీ స్టూడెంట్లను లెక్కలోకి తీసుకోవట్లే!

కోరుట్లరూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ అకడమిక్​ఇయర్​లో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో చాలాచోట్ల ఎల్​కేజీ, యూకేజీలో పిల్లలను చేర్చుకున్నారు. ఆధార్​కార్డు నంబర్​తో సహా స్టూడెంట్ల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయడంతో సర్కారు వారికి ఐడీ నంబర్​ కూడా కేటాయించింది. అయినప్పటికీ ఆఫీసర్లు మధ్యాహ్న భోజనం, సౌకర్యాల కల్పన విషయంలో వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు. అంగన్​వాడీలో చదివే స్టూడెంట్లుగానే వారిని పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. సర్కారు స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పేర్కొన్న రూల్స్ ప్రకారం ఒకటి నుంచి పై తరగతులు చదువుతున్న స్టూడెంట్లను మాత్రమే సౌకర్యాల కల్పన విషయంలో లెక్కలోకి తీసుకుంటున్నారు. ఎల్​కేజీ, యూకేజీ స్టూడెంట్ల ప్రస్తావన అందులో లేకపోవడంతో వారికి కావాల్సిన బెంచీలు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది స్టూడెంట్ల పరిస్థితి గందరగోళంగా మారింది. 

మీడ్​డే మీల్స్​ఎలా?

మిడ్​డే మీల్స్​స్కీంకు స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య ఆధారంగా సర్కారు బిల్లులు చెల్లిస్తోంది. ప్రైమరీ స్కూళ్ల స్టూడెంట్లకు ఒక్కరికి రోజుకు రూ. 4.48 చొప్పున ఇస్తోంది. ఎల్​కేజీ, యూకేజీ పిల్లలను లెక్కలోకి తీసుకోకపోవడంతో వారికి మధ్యాహ్న భోజనం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఉన్న స్టూడెంట్లకే వండి పెట్టడం భారంగా మారిందని వంట ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక చిన్నారులకు ఏం వండిపెట్టాలని అంటున్నారు. ఇంగ్లీష్​మీడియం అనడంతో సర్కారు బడిలో చేర్పించామని, అయితే కనీస సౌలత్​లు లేనపుడు ఎలా చదివించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కోసం టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్న ప్రభుత్వం ప్రతి స్కూల్ లో నర్సరీ క్లాసులకు  స్టాఫ్​ను పెంచాలని, పిల్లలకు కావాల్సిన సౌలత్​లు కల్పించాలని, మధ్యాహ్న భోజనం అందించాలని టీచర్​ యూనియన్​ లీడర్లు కోరుతున్నారు. ఇందుకు అవసరమైతే మన ఊరు–మన బడి కార్యక్రమానికి సవరణ చేయాలని సూచిస్తున్నారు.