ఎంపీ టికెట్​ కోసం..ప్రధాన పార్టీల్లో పోటాపోటీ

ఎంపీ టికెట్​ కోసం..ప్రధాన పార్టీల్లో పోటాపోటీ
  •     లిస్టులో సీనియర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
  •     గెలుపు గుర్రాలకే ప్రియారిటీ ఇచ్చే యోచనలో హైకమాండ్​లు

మహబూబ్​నగర్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేలా ప్లాన్​ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు రోజులుగా కాంగ్రెస్​తో పాటు బీజేపీ, బీఆర్ఎస్​ హైకమాండ్​లు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర క్యాడర్​తో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాయి. 

ప్రజల్లో ఎవరికి బలం ఉంది? టికెట్​ ఎవరికి ఇస్తే గెలుస్తారు? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఓటింగ్​ పర్సంటేజీ ఎలా ఉంది? వంటి విషయాలపై ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు చొప్పున టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో టికెట్లు ఎవరికి వస్తాయనే చర్చ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

హాట్​ సీట్​గా మహబూబ్​నగర్..​

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ స్థానం ఈ ఎన్నికల్లో హాట్​ సీట్​గా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్​ లీడర్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి వనపర్తి జిల్లాకు చెందిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడి సమస్యలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. దీనికితోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్​ ఇచ్చి, హైకమాండ్​ క్యాన్సిల్​ చేసింది. చిన్నారెడ్డిని బుజ్జగించి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డికి టికెట్ కేటాయించగా, ఆయన గెలుపు కోసం కృషి చేశారు. 

ఈ క్రమంలో పార్లమెంట్​ ఎన్నికల్లో హైకమాండ్​ తనకు టికెట్​ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కల్వకుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్​ రెడ్డి కూడా మహబూబ్​నగర్​ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ ఏపీ జితేందర్​ రెడ్డి ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. 1999లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

2019లో తిరిగి బీజేపీలో జాయిన్​ అయ్యి పార్టీ క్యాండిడేట్​ డీకే అరుణకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సారి మాత్రం తనకే టికెట్​ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి కూడా తనకే టికెట్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాకు చెందిన దిలీప్​ ఆచారి కూడా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ అసెంబ్లీ టికెట్​ ఆశించగా, అలయెన్స్​లో జనసేన క్యాండిడేట్​కు టికెట్​ వచ్చింది. దీంతో వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో తనకు టికెట్​ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్​ పార్టీ నుంచి మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్​రెడ్డి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. 

ఆయనను పార్టీలో జాయిన్​ చేసుకునే క్రమంలోనే పార్లమెంట్​ టికెట్​ ఇస్తామని హైకమాండ్​ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు.  అలాగే మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి కూడా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తనకు టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. 

అలంపూర్​లోనూ పోటాపోటీ..

అలంపూర్​ పార్లమెంట్​ స్థానం కోసం పోటాపోటీ నడుస్తోంది. కాంగ్రెస్​ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్​ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

అలాగే మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు గతంలో ఆయనకు ఎంపీగా చేసిన అనుభవం ఉండడంతో టికెట్​ తనకే వస్తుందన్న ఆశతో ఉన్నారు. బీజేపీ నుంచి బంగారు శ్రుతి పోటీ చేసే చాన్స్​ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్​ నుంచి ప్రస్తుత ఎంపీ పి.రాములు మరోసారి పోటీ చేసే అవకాశాలున్నాయి. 

లేదంటే ఆయన కుమారుడు భరత్​కు టికెట్​ కేటాయించాలని  హైకమాండ్​ ముందుంచే అవకాశాలున్నాయి. ఇటీవల భరత్​కు అచ్చంపేట అసెంబ్లీ టికెట్​ ఇవ్వాలనే డిమాండ్​ వచ్చినా హైకమాండ్​ పట్టించుకోలేదు. దీంతో పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయనకు పార్లమెంట్​ టికెట్​ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా పార్లమెంట్​ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్​కు పెరిగిన బలం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్​నగర్, అలంపూర్​ పార్లమెంట్​ నియోజకవర్గాలు ఉన్నాయి. అలంపూర్​ ఎస్సీకి రిజర్వ్​ కాగా, మహబూబ్​నగర్​ జనరల్​ స్థానం. ఉమ్మడి జిల్లాలో14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈ రెండు పార్లమెంట్​ నియోజకవర్గాల్లో ఏడేసి అసెంబ్లీ స్థానాలున్నాయి. అలంపూర్​ పార్లమెంట్​ పరిధిలో గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి స్థానాలున్నాయి. ఇందులో అలంపూర్, గద్వాల మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక​మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలోని జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్​నగర్, షాద్​నగర్, నారాయణపేట, మక్తల్, కొడంగల్​ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఈ ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గెలిచారు.