ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి మంటలు మొదలయ్యాయి. కొన్నాళ్లపాటు నివురుగప్పిన నిప్పులా ప్రశాంతంగా కనిపించిన మణిపూర్ లో మళ్లీ అల్లర్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మణిపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మళ్లీ ఘర్షణ వాతావరణం మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
శుక్రవారం (3 జనవరి 2025) కంగ్ పోక్పి జిల్లాలో పోలీసు బలగాలకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో కొందరు పౌరులకు గాయాలు అయ్యాయి. అదే సమయంలో ఎస్పీతో సహా మరికొంత మంది పోలీసులకు కూడా గాయాలు కావడంతో వాతావరణం వేడెక్కింది. ఎస్పీ ఆఫీసుపై కుకీ- -- జో తెగల నిరసనకారులు దాడులు చేయడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
కంగ్ పోక్పి జిల్లా సైబోల్ గ్రామంలో బలగాలను మోహరించడంపై ఆగ్రహించిన ప్రజలు ఎస్పీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఎస్పీ ఆఫీసు కంపౌండ్ ను కూల్చివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఎస్పీ మనోజ్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
31 జనవరి 2024 న సైబోల్ గ్రామంలో మహిళపై పోలీసుల బాటన్ చార్జీకి నిరసనగా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు కుకి - జో తెగ ప్రజలు. దీంతో 12 గంటల బంద్ ప్రకటించిన ప్రజలు.. పోలీసు బలగాలను ఉపసంహరించుకునే వరకు నిరసనలు ఆగవని గిరిజన సమాఖ్య తెలిపింది. బలగాల ఉపసంహరణ డిమాండ్ చేస్తూ నిరసనకారులు చేసిన ర్యాలీ ఘర్షణకు దారితీసిందని, నిరసనకారుల దాడులలో ఎస్పీ సహా పోలీసలు గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల దాడిలో అమాయక ప్రజలు గాయపడ్డారని నిరసనకారుల సంఘం సభ్యులు చెబుతున్నారు. చినికి చినికి గాలివానలా మారి మళ్లీ మణిపూర్ అంటుకుంటుందేమోనని మణిపూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మణిపూర్ లో 2023 నుంచి మెయిటీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 250 మంది ప్రజలు చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు.