- ఓటేసిన సీఎం సైనీ, మనోహర్‌లాల్ కట్టర్, భూపిందర్ సింగ్
- తొలిసారి ఓటేసిన మను బాకర్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 90 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. సాయంత్రానికి పుంజుకున్నది. సమయం గడిచేకొద్దీ పోలింగ్‌బూత్‌లకు ఓటర్ల పోటెత్తారు. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైనట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్అగర్వాల్ తెలిపారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మరో రెండు పార్టీల కూటమి మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్నది. అన్ని పార్టీలనుంచి మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 464 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. 101 మంది మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సీఎం నాయబ్‌సింగ్ సైనీ, బీజేపీకి చెందిన అనిల్‌విజ్, ఓపీ దన్ఖడ్, కాంగ్రెస్‌కు చెందిన భూపిందర్‌సింగ్ హుడా, వినేశ్ఫొగట్, ఐఎన్ఎల్డీకి చెందిన అభయ్సింగ్చౌతాలా, జేజేపీ కి చెందిన దుష్యంత్‌చౌతాలా లాంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీజేపీ ఈసారి కూడా విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నది. అదే సమయంలో దశాబ్దం తర్వాత హర్యానాలో జెండా ఎగురేయాలని కాంగ్రెస్గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఓటేసిన ప్రముఖులు
పోలింగ్ ప్రారంభమైన తొలిగంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కురుక్షేత్రలోని లాడ్వా నుంచి బరిలో ఉన్న సీఎం సైనీ.. తన స్వగ్రామమైన మిర్జాలో ఓటేశారు. కర్నాల్‌లో మాజీ సీఎం, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కురుక్షేత్రలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సిర్సాలో మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ఓ టేశారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ లో డబుల్మెడల్స్ సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి తొలిసారి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.