భక్త జన గణపతి బడా గణేశ్..​దర్శనానికి బారులు తీరిన జనం

భక్త జన గణపతి బడా గణేశ్..​దర్శనానికి బారులు తీరిన జనం
  • వీకెండ్​ కావడంతో ఖైరతాబాద్​కు పోటెత్తిన భక్తులు
  • మెట్రో స్టేషన్​ నుంచి వినాయక విగ్రహం వరకు క్యూలు
  • కిక్కిరిసిన మెట్రో రైళ్లు, ఖైరతాబాద్ ​స్టేషన్
  • ఉదయం 5 గంటల నుంచే మొదలైన భక్తుల రాక
  • ఇయ్యాల అర్ధరాత్రితో ముగియనున్న మహా గణపతి దర్శనాలు
  • సెప్టెబర్ 16న భక్తులకు నో ఎంట్రీ.. ఎల్లుండి శోభాయాత్ర, మహా నిమజ్జనం

హైదరాబాద్ సిటీ, వెలుగు:వీకెండ్​కావడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. సిటీతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. సాధారణ భక్తులతోపాటు పలువురు వీఐపీలు కలిపి దాదాపు 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు.

 తెల్లవారుజాము 5 గంటల నుంచే కూలైన్లలో బారులు తీరారు. దీంతో ఖైరతాబాద్​పరిసరాలన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఖైరతాబాద్​మెట్రో స్టేషన్​నుంచి బడా గణేశ్​విగ్రహం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ రోజంతా కిటకిటలాడింది. 

మెజారిటీ భక్తులు మెట్రో ద్వారా ఖైరతాబాద్​చేరుకుంటున్నారు. విగ్రహానికి స్టేషన్​ ఆనుకుని ఉండడంతో భక్తులు మెట్రోనే ప్రిఫర్​చేస్తున్నారు. లక్షల్లో భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్​పరిసరాల్లోని రోడ్లపై శనివారం భారీగా ట్రాఫిక్​స్తంభించింది. ఉదయం 10 గంటల తర్వాత తీవ్రత పెరిగింది.

 ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, చింతల్ గూడ బస్తీ పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారంతో బడా గణేశ్​వద్ద భక్తుల దర్శనాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు రుద్రాక్షలు పంపిణీ చేయనున్నారు.

సోమవారం నిమజ్జనానికి ఏర్పాట్లు చేయనున్నారు. శోభాయాత్రకు సంబంధించిన వెల్డింగ్​పనులు జరగనున్నాయి. ఈ కారణంగా భక్తులకు ఎంట్రీ లేదని నిర్వాహ కులు స్పష్టం చేశారు.