ఆ ఇద్దరికే ప్రాబ్లమ్.. జమిలీ ఎన్నికలపై అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్

ఆ ఇద్దరికే ప్రాబ్లమ్.. జమిలీ ఎన్నికలపై అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్

హైదరాబాద్: జమిలీ ఎన్నికలకు (వన్ నేషన్ వన్ ఎలక్షన్) మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత మాజీ రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఇవాళ (సెప్టెంబర్ 18) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‎కు సెంట్రల్ కేబినెట్ అప్రూవల్ ఇవ్వడంతో ఈ ఇష్యూ దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. ఈ క్రమంలో జమిలీ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన ఓవైసీ.. జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికల విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.

 ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని నేను స్థిరంగా వ్యతిరేకించాను. ఎందుకంటే ఇది కొత్త సమస్యను కొనితెచ్చుకోవడం. జమిలీ ఎన్నికల విధానం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని రాజీ చేస్తుంది. మోడీ, షా ఇద్దరికి తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వారికి ఉన్నంత మాత్రాన మనకు ఏకకాల ఎన్నికలు అవసరం లేదు. విడతల వారిగా నిర్వహించే ఎన్నికలే ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయి’’ అని వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఓవైసీ.

Also Read :- చంద్రయాన్ 4 మూన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం

 కాగా, జమిలీ ఎన్నికల విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంతో.. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టినున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. ఇకపై దేశంలో  100 రోజుల్లోనే లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, జమిలీ ఎన్నికల విధానాన్ని దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేస్తోంది. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ సాధ్యం కాదని.. తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ తెరపైకి తెచ్చిన స్టంటే జమిలీ ఎన్నికలని విమర్శించింది. కాంగ్రెస్ తో పాటు దేశంలోని మరో 15 పార్టీలు సైతం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి.