షమ్లి: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే అసదుద్దీన్ ఒవైసీ జంధ్యం వేసుకుంటారని ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. యూపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడనప్పటికీ.. నేతలు హాట్ కామెంట్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో యూపీ పంచాయతీ రాజ్ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి యూపీలో అధికారాన్ని హస్తం గతం చేసుకోనుందని భూపేంద్ర అన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే.. అసదుద్దీన్ జంధ్యం ధరించి, రామ నామస్మరణ చేయాలని సవాల్ విసిరారు.
‘మేం స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ఈ ఎజెండా కారణంగానే అఖిలేష్ యాదవ్ ఆలయాలకు వెళ్లడం ప్రారంభించారు. ఇదే ఎజెండా వల్ల రాహుల్ గాంధీ జంధ్యం వేసుకుని, తన గోత్రం గురించి అందరికీ చెబుతున్నారు. మా సిద్ధాంతం చూపే ప్రభావం వల్లే వాళ్లు తమ సొంత ఎజెండాలను వదిలి మమ్మల్ని అనుసరించడం మొదలుపెట్టారు. కేవలం మైనారిటీల గురించి మాట్లాడటం, శ్రీరాముడి ఉనికిని నమ్మకపోవడం, రాముడు కల్పిత పాత్ర అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో చెప్పిన వాళ్లు ఉన్నారు. వీళ్లు కూడా జంధ్యం వేసుకుని.. గుళ్లకు వెళ్లడం ప్రారంభించారు’ అని భూపేంద్ర చౌదరి పేర్కొన్నారు.