బాబా ఆశారాంకు బెయిల్.. హెల్త్ రీజన్స్తో మధ్యంతర బెయిల్​ ఇచ్చిన సుప్రీంకోర్టు

బాబా ఆశారాంకు బెయిల్.. హెల్త్ రీజన్స్తో మధ్యంతర బెయిల్​ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బాలిక, మహిళపై రేప్ కేసుల్లో దోషి.. జోధ్​పూర్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద బాబా ఆశారాం బాపూ(83)కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2013 లో పోలీసులు ఆశారాంను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న ఆశారాంకు ఓ కేసులో కోర్టు 2018లో, మరో కేసులో 2023లో జీవిత ఖైదు విధించింది. ఈ కేసుల్లో తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు మార్చి 31 వరకు మధ్యంతర బెయిలు ఇచ్చింది. 17 రోజులు పెరోల్​పై బయట ఉన్న ఆయన 2025 జనవరి 1వ తేదీనే తిరిగి జైలుకు వెళ్లారు. వారం రోజుల్లోనే మళ్లీ బెయిలుపై బయటకు రావడం గమనార్హం.

ఆశారాం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. వైద్యం చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్​ ఇవ్వాలని కోరుతూ అతని తరఫు లాయర్లు ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయమూర్తులు జస్టిస్​ ఎంఎం సుందరేశ్, రాజేశ్ బిందాల్​తో కూడిన డివిజన్​ బెంచ్ మంగళవారం విచారించింది. వాదనలు విన్న బెంచ్​ ఆశారాంకు మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసింది అయితే, విడుదలైన తర్వాత అనుచరులను కలవకూడదని షరతు విధించింది. ఆశారాంను ఆసుపత్రికి తరలించాలని, అయితే చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని అధికారులను ఆదేశించింది.