
తెలంగాణ ఆశా వర్కర్స్ చేపట్టిన ఆరోగ్య శాఖ కమీషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపు నివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు ఆశా వర్కర్లు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఎక్కడిక్కడ ఆశా వర్కర్స్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆశ వర్కర్స్ కు తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
Also Read : హైదరాబాద్లో మోగిన ఎన్నికల నగారా
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 లు ఫిక్స్డ్ వేతనం , 50 లక్షల ఇన్సూరెన్స్, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ. 50 వేల సాయం, విధుల్లో మరణించిన ఆశావర్కర్లకు మట్టి ఖర్చుల కింద రూ.50వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమోషన్లు, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.