ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించిన ఆశాలు

దమ్మపేట/కూసుమంచి/వైరా, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశా వర్కర్లు ఎమ్మెల్యేల ఇండ్లను, క్యాంప్​ ఆఫీసులను ముట్టడించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెంలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతిఒక్క ఆశా వర్కర్​కు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 

గ్రామాల్లోని ప్రజలకు అనేక సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదన్నారు. పైగా పని భారం పెంచి శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పారితోషికాలు రద్దు చేసి కనీస వేతనం రూ.18వేలుగా నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అర్హులైన ఆశా వర్కర్లను రెండో ఏఎన్ఎంలుగా గుర్తించాలని, క్వాలిటీ యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, రైతు సంఘం నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, ఆశాలు భారతి, నాగమణి, సమత, రజిని, సునీత, జయ, విజయ తదితరులు పాల్గొన్నారు. 

సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్​రావు ఆధ్వర్యంలో మంగళవారం కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసును ఆశా వర్కర్లు ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే పీఆర్ఓకు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు. మోహన్ రావు మాట్లాడుతూ.. 2006 నుంచి గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. 

అలాంటివారి సేవలను ప్రభుత్వ గుర్తించి కనీస వేతనం అమలుచేయాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు వీరన్న, ఆశ వర్కర్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు బి.మల్లీశ్వరి, బి.జ్యోతి, నాయకులు టి.భాగ్యమ్మ, నాగమణి, పుష్ప, శరబమ్మ, ఉమాదేవి, సుజాత, ఉష, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి బానోత్ అమల ఆధ్వర్యంలో వైరాలోని ఎమ్మెల్యే రాములునాయక్​క్యాంప్​ఆఫీస్ ముందు మంగళవారం ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. వైరా పాత బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అందజేశారు. సీఐటీయూ జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వైరా కన్వీనర్ అనుమోలు రామారావు, వైరా రూరల్ కన్వీనర్ బాజోజు రమణ, ఏన్కూరు మండల కన్వీనర్ ఏర్పుల రాములు, ఆశా వర్కర్లు  శైలజ, అనురాధ, సాయిబి, ప్రశాంతి, రజిత, నీలిమ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.