ఒకే ఆటోలో 10మంది ఆశావర్కర్లు..బ్రేక్ ఫెయిల్ బోల్తా

ఒకే ఆటోలో 10మంది ఆశావర్కర్లు..బ్రేక్ ఫెయిల్ బోల్తా

బాలాపూర్ పీహెచ్ సీ సెంటర్ లో ఆశావర్కర్లు ఆందోళన దిగారు. తమ వారికి మెరుగైన వైద్యం అందించడం లేదంటూ నిరసన చేపట్టారు. నిన్న బాలాపూర్ షాహినగర్ లో జరిగిన ఆటో బోల్తా పడిన సంఘటనలో తీవ్ర గాయాలై.. చికిత్స పొందుతున్న  కవిత, సుమలత అనే ఆశావర్కర్లను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. బాలాపూర్ లోని షాహినగర్ లో సర్వేకోసం ఒక ఆటోలో 10 మందిని ఎక్కించి పంపించారని, ఉన్నట్టుండి ఆ ఆటో బ్రేక్ ఫెయిలై.. బోల్తా పడిందని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో నిన్న వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అయితే.. అక్కడ కూడా పట్టించుకోకపోవడంతో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారని, అక్కడా సరైన ట్రీట్ మెంట్ చేయడం లేదని ఆశావర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

నిన్నటి ఘటనలో గాయపడ్డ కవిత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పని చేస్తున్న తమనే డాక్టర్లు పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. గాయపడ్డ ఆశావర్కర్లకు మెరుగైన వైద్యం అందించాలని లేకపోతే ఇక్కడే కూర్చుంటామని ఆందోళనకు దిగారు. విషయం తెలిసి డిప్యూటీ డీఎంహెచ్ వో గీత అక్కడకు వెళ్లారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం చేయిస్తామని, సమస్య ఏదైనా ఉంటే పేపర్ పై రాసి ఇవ్వాలని, దాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తానని చెప్పారు. డీఎంహెచ్ వో గీత వివరణకు సంతృప్తి చెందని ఆశావర్కర్లు.. సరైన వైద్యం చేయిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు.