- డిమాండ్లు నెరవేర్చాలంటూ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ ఆఫీసు ఎదుట ధర్నా
- ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తోపులాట
- సీఐపై చేయి చేసుకున్న మహిళలు..పలువురు ఆశా వర్కర్లకు గాయాలు
- హాస్పిటల్‌లో ఆశలను పరామర్శించిన మాజీ మంత్రులు
బషీర్‌బాగ్, వెలుగు : ఆశా వర్కర్ల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు, అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న ఆశాలను అడ్డుకొని, అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆశాలకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఓ ఆశా వర్కర్ సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకుంది. ఏసీపీ శంకర్ ఓ మహిళను అడ్డుకునే సమయంలో ఆమెపై చెయ్యి వేయడంతో ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే, లెప్రెసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతే కొత్త సర్వేలు చేయించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లేప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని
సర్వేకు సంబంధించి ట్రైనింగ్ కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. అయితే, డబ్బుల చెల్లింపు విషయంలో రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో ఆశాలు గందరగోళానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన ఆశాలు..
పోలీసులకు, ఆశాలకు మధ్య జరిగిన తోపులాటలో రహీంబీ, రావుల సంతోషా, భవాని, యాదమ్మ సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో రహీంబీ ఎడమ చేతికి గాయం, ఛాతీలో నొప్పి రావడంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ట్రీట్‌మెంట్ అందించి పంపించారు. తోపులాటలో గాయపడిన వారిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పరామర్శించారు.
Also Read : వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు
శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే..పోలీసులు రెచ్చగొట్టి దాడి చేశారని వారు ఆరోపించారు. ఏడాది సంబురాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు చేస్తూ, మరోవైపు మహిళలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు..
ఆశా వర్కర్లపై దురుసుగా ప్రవర్తించిన సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్ చారిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిధి దాటి మహిళలు అని చూడకుండా అసభ్యకరంగా భౌతిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రెండేండ్లుగా లెప్రసీ డబ్బులు చెల్లించలే..
గత రెండేండ్లలో చేసిన లెప్రసీ సర్వే, 2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తమని మోసం చేస్తున్నదని, ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసీ సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి, ఆశలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
ఆందోళనలలో ఆశలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, నాయకులు శ్రీనివాస్, మరయ్య, నారాయణ, నగేశ్ తదితరులపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.