కామారెడ్డి టౌన్/ఎడపల్లి/నవీపేట్/వర్ని, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ తోపాటు ఆయా చోట్ల ఆశా కార్యకర్తలు శుక్రవారం ఆందోళన చేశారు. వారికి ఆయా పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ర్యాలీలు నిర్వహించారు. మానవహారాలు చేపట్టారు. ధర్నాలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ఎదుట సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజమణితోపాటు ఆయా చోట్ల పలువురు నాయకులు మాట్లాడారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా స్పందించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.