జులై 7 నుంచి బోనాలు షురూ.. గోల్కొండ అమ్మకు మొదటి బోనం

జులై 7 నుంచి బోనాలు షురూ.. గోల్కొండ అమ్మకు మొదటి బోనం

హైదరాబాద్​, వెలుగు:  ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్​, లాల్​ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలోని ప్రతి గల్లీ నెలపాటు  వేపాకు తోరణాలతో కళకళలాడనున్నది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో ఆలయాలు మార్మోగనున్నాయి.  

ప్రతిఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు పచ్చికుండతో తొలిబోనం సమర్పించడంతో.. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.  ముందుగా జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత జులై 21న సికింద్రాబాద్​ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు,  22 రంగం కార్యక్రమం, జులై 28 న లాల్​ దర్వాజా బోనాల ఉత్సవాలు, చివరగా... ఆగస్టు 4న మళ్లీ గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.  ప్రతి దేవాలయంలో బోనాలు ముగిసిన మరుసటి రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. 

గోల్కొండ అమ్మకు తొలి బువ్వతో మొదలై...

గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయం అతి పురాతనమైనది. కాకతీయులు, తానీషాల కాలం నుంచి ఇక్కడ అమ్మవార్లు పూజలందుకుంటున్నారు. అందుకే.. ఇక్కడ తొలి బోనం సమర్పించి, ఉత్సవాలను ప్రారంభిస్తారు. మొదటగా.. జులై 7న లంగర్​ హౌజ్​ చౌరస్తా నుంచి బోనాల జాతర ఉత్సవం షురూ అవుతుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఊరేగింపుగా గోల్కొండ దేవాలయానికి చేరుకుంటారు. తొలి బోనం నుంచి చివరి బోనం వరకు నెలపాటు ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ అమ్మవార్లకు 9 రకాల పూజలను నిర్వహిస్తారు. 

గోల్కొండ బోనాల అనంతరం బల్కంపేట ఎల్లమ్మ కు రెండో బోనం సమర్పిస్తారు.  జులై 8న ఎదుర్కోలు, 9వ అమ్మవారి కల్యాణం, 10న రథోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి కల్యాణం రోజున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది మొదటి ఆదివారం జులై 7నే.. సికింద్రాబాద్​ ఉజ్జయిని అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం, ఘటాల ఊరేగింపు ప్రారంభిస్తారు. 21న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం, పట్టువస్త్రాల సమర్పణ, 22న రంగం ఉంటుంది. జులై 28న లాల్​ దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాల ఉత్సవం,  మరుసటి రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 4 వరకు సిటీలోని ఆయా ప్రాంతాల్లో బోనాల పండుగను నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి వీడ్కోలు పలకడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 

బోనాల ఉత్సవాలు.. నిర్వహించే తేదీలు ఇవే.

                 తేదీ        దేవాలయం

  • జులై 7, ఆదివారం    గోల్కొండ జగదాంబిక బోనాల ప్రారంభం
  • జులై 9,  మంగళవారం    బల్కంపేట అమ్మవారి కల్యాణ మహోత్సవం
  • జులై 7, ఆదివారం     సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎదుర్కోలు
  • జులై 21, ఆదివారం    సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాలు
  • జులై 22, సోమవారం    ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం, భవిష్యవాణి
  • జులై 28, ఆదివారం    లాల్​ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు
  • జులై 29, సోమవారం    సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం, భవిష్యవాణి