భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్ లోని ఆలయాల్లో ఘనంగా జరుగుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా 24 ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజాలోని అమ్మవారి ఆలయంలో బలిగంపతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. దీంతో ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల సందర్భంగా పలు చోట్ల పోలీసులు టాఫ్రిక్ ఆంక్షలు విధించారు.
మరోవైపు రాత్రి 8 గంటలకు శాంతి కళ్యాణం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి పోతరాజుల వీరంగం.. 4 గంటలకు రంగం కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఘటాలను ఊరేగించి అర్ధరాత్రి మూసీలో నిమజ్జనం చేస్తారు. పాతబస్తీలోని అమ్మవారి ఆలయాల్లో రెండురోజుల పాటు బోనాల జాతర జరగనుంది. దీంతోపాటు నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు.
అధికారికంగా జాతర
రాష్ట్రంలో బోనాలను అధికారిక పండుగగా నిర్వహిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి సంవత్సరం బోనాల జాతరను నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయ వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నామని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు.