బూతులు వినలేకున్నా.. నా పిల్లలకు క్రికెట్‌కు వద్దు: ఆస్ట్రేలియా ఓపెనర్

బూతులు వినలేకున్నా.. నా పిల్లలకు క్రికెట్‌కు వద్దు: ఆస్ట్రేలియా ఓపెనర్

తండ్రి వారసత్వాన్ని తనయులు కొనసాగించడమన్నది అన్ని రంగాల్లో ఉండేదే. సినీ హీరోలు తమ పిల్లలను హీరోహీరోయిన్లుగా చేస్తుంటే.. డాక్టర్లు, ఇంజినీర్లు వారి పిల్లలను అదే వృత్తిలోకి తీసుకొస్తున్నారు. కొందరు క్రికెటర్ల వారసులు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. మాజీ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రోజర్ భిన్నీ, సచిన్ టెండూల్కర్ తనయులు మొదలు.. క్రికెట్ ఆడే దేశాల నుండి ఎందరో వారసులు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

కాకపోతే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం తమ పిల్లలను క్రికెటర్లు కావొద్దని కోరుకుంటున్నారు. అందుకు కారణం.. అభిమానుల దుర్భాషలు అతను వినలేకపోవటమే. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో ఆడుతున్న ఖవాజా, ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు సందర్భంగా కొంతమంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్లపై జరిగిన దుర్భాషలను విని ఈ నిర్ణయం తీసుకున్నారు.

నా పిల్లలకు క్రికెట్‌కు వద్దు

"నేను క్రికెట్ నుంచే వచ్చా, క్రికెట్‌ని చూస్తూనే పెరిగా. కానీ నా పిల్లలు మాత్రం ఇటు వైపు రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే క్రికెట్ చూడడానికి వచ్చే వారిలో 100 శాతం మంది ఏదో ఒక విమర్శ చేసే వెళ్తారు. అందులో కొందరు మాటలు మరీ బాధిస్తాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో ట్రావిస్ హెడ్‌ని బండ బూతులు తిట్టారు. ఆ మాటలు, మరెక్కడా చెప్పలేం.. మాట్లాడలేం. ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాకి వచ్చినపుడు వారికి ఇదే రకమైన అనుభవం ఎదురవుతుంది. దానికి నేను వ్యతిరేకం." 

నేను అలాంటి అభిమానిని కాదు

నేను సరదా కోసం క్రీడలు ఆడేవాడిని, చూసేవాడిని. కానీ ఏనాడూ హద్దులు దాటలేదు. ఉదాహరణకు ఎన్‌బీఏను చూడండి. అక్కడా ఇలాంటివి జరుగుతుంటాయి. జనాలు.. ఆటను, జట్టుని తమ సొంత టీమ్‌గా ఫీల్ అవుతారు. అందుకే ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ, నేను దానితో ఏకీభవించను" అని ఖవాజా చెప్పుకొచ్చారు.

కాగా, యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్‌ వేదికగా జూలై 19 నుండి ప్రారంభం కానుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది.