రావత్ చితాభస్మం గంగా నదిలో కలపనున్న కుమార్తెలు

రావత్ చితాభస్మం గంగా నదిలో కలపనున్న కుమార్తెలు

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌‌ స్క్వేర్‌‌ శ్మశాన వాటికలో ముగిశాయి. సైనిక లాంఛనాల మధ్య, యావత్‌ దేశం కన్నీటి వీడ్కోల మధ్య ఆ ఇద్దరి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. వారి కుమార్తెలు కృతిక, తరుణి కలిసి బిపిన్ దంపతుల చితికి నిప్పుపెట్టి చేశారు. ఈ సమయంలో సైనికులు 17 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం తెలిపారు.

అయితే దహన సంస్కారాల తర్వాత పుణ్య నదుల్లో చితాభస్మం కలపడం హిందూ సంప్రదాయంలో ఆచరిస్తుంటారు. ఈ క్రమంలో  బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని కూడా గంగా నదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం రావత్ సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌‌లో గంగా ప్రవాహంలో బిపిన్ రావత్, మధులికా రావత్‌ల చితాభస్మాన్ని వారి కుమార్తెలు కలపనున్నారు. ఈ కార్యక్రమంలో రావత్ కుటుంబసభ్యులతో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌, పలువురు ఆర్మీ అధికారులు పాల్గొంటారు.