నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అశోక్ గౌడ్

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అశోక్ గౌడ్

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఒకటో వార్డ్ కౌన్సిలర్ అశోక్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తన పదవికి రాజీనామా చేయగా వైస్ చైర్మన్ నహీముద్దీన్ ఇన్​చార్జి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కొత్త చైర్మన్ ను ఎన్నుకునేందుకు  మున్సిపల్ ఆఫీసులో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మీటింగ్ నిర్వహించారు.

ఈ మీటింగ్ కు బీజేపీ కౌన్సిలర్లు ఆరుగురు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ కు మెజరిటీగా 9 మంది కౌన్సిలర్ల  బలం ఉండడంతో పాటు, ఎక్స్ అఫిషియో సభ్యులైన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎమ్మెల్సీలు  వెంకట్రాంరెడ్డి, యాదవరెడ్డి ల మద్దతు కూడా ఉంది. ఈ మేరకు స్వతంత్ర కౌన్సిలర్ రామచందర్ ఒకటో వార్డు కౌన్సిలర్  అశోక్ గౌడ్ ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా  తంగడపల్లి సరిత బలపరచగా ఒక్కరే నామినేషన్ వేయడంతో చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.