బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం : అశోక్ కుమార్

బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం :  అశోక్ కుమార్

మెదక్, వెలుగు: గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని టీపీటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్​ లో ఏర్పాటు చేసిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య​ అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సర్కార్ రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిందన్నారు.

హెచ్ఎంలు, ఏంఈఓలు, డీఈఓలు లేక పర్యవేక్షణ కరువైందన్నారు. గతంలో అధికారమంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉందని, స్కూల్స్​, టీచర్స్​ సమస్యలపై  ప్రభుత్వ పెద్దల, ఉన్నతాధికారులను కలిసే పరిస్థితి ఉండేది కాదని, కనీసం ఫోన్​లో కూడా మాట్లాడే అవకాశం దొరికేదికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్వేచ్ఛ లభించిందన్నారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.

 గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోమని, విద్యారంగ, ఉపాధ్యాయ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. టీపీటీఎఫ్​ మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వేణుగోపాల్, కొండల్​రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. యూనియన్​ అదనపు ప్రధాన కార్యదర్శి రవీందర్​ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సీపీఎస్​ రద్దు, పండిట్, పీఈటీ ప్రమోషన్లు తదితర సమస్యలు పరిష్కరించలేదన్నారు.

ఈ సదస్సులో టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగయ్య, వెంకట్రామ్​రెడ్డి, నాయకులు రాంచంద్రం, భాస్కర్​రెడ్డి, నాగిరెడ్డి, యాదగిరి,  తిరుపతిరెడ్డి, ముత్యాలు, శశిధర్, నజీరొద్దీన్, నీలకంఠం, నర్సింలు, సురేందర్, నాగరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.