వయసుకే తాత అయినా విజేత
విప్రో, మైండ్ ట్రీలను గ్లోబల్ స్థాయికి చేర్చిన వైనం
68 ఏళ్ల వయసులో రెండో బిజినెస్ ..అదీ సక్సెసే
పేరుకి తగ్గట్లే నిలబడింది ఓ కంపెనీ. పుట్టిన పదేళ్లలో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ అటు ఉద్యోగులను, ఇటు ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచింది. 70 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి మరో పది మందితో కలిసి ఈ కంపెనీని పెట్టారు. అందరూ నడిచే దారిలో కాకుండా, పూర్తిగా డిజిటల్ టెక్నాలజీపైనే ఫోకస్‌తో కంపెనీని నడిపించారు. రెవెన్యూతోపాటు, లాభాలూ బాగుండటంతో తాజాగా పబ్లిక్ ఇష్యూకి వెళ్లారు. ఇష్యూ 151 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ తెచ్చుకుంది. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత వచ్చిన ఈ మొదటి ఐపీఓకి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతోపాటు, రిటెయిల్ ఇన్వెస్టర్లూ ఎగబడటమే దీనికి కారణం. ఆ కంపెనీ పేరే హ్యాపీయెస్ట్‌మైండ్స్, ఆ ప్రమోటర్ పేరు అశోక్ సూతా. గురువారం హ్యాపీయెస్ట్‌మైండ్స్ షేర్లు ఎక్స్చేంజీలలో 111 శాతం లాభంతో జర్నీ మొదలెట్టాయి. లిస్టింగ్‌లోనే అదరగొట్టిన ఈ కంపెనీ ఆ తర్వాతా ట్రేడింగ్‌లో లాభాలే చూసింది.
బిజినెస్ డెస్క్, వెలుగు: రెండోసారి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ సాధించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా 70 ఏళ్ల వయసులో, అప్పటికే ఫుల్ కాంపిటేషన్ ఉన్న సెక్టార్లో అడుగుపెట్టి.. గెలవడం తర్వాత మాట, నిలవడమే చాలా కష్టం. కానీ ఆయన గెలిచి చూపించారు. తన 30 ఏళ్ల ఐటీ కెరీర్‌లో ఎన్నో విజయాలను చూసిన సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్ అశోక్ సూత, గురువారం మరో హిట్ కొట్టి 77 ఏళ్ల వయసులో కూడా తన సత్తా తగ్గలేదని నిరూపించారు. ఆయన స్థాపించిన ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురువారం మార్కెట్లో బంపర్ బోణీ చేసింది. ఐపీఓ ధర కంటే ఏకంగా 111 శాతం ఎక్కువ ధరకు లిస్ట్ అయ్యింది.
గ్లోబల్ స్థాయికి విప్రో..
ఢిల్లీలో పుట్టిన అశోక్ సూత తన ఇంజినీరింగ్‌ను ఐఐటీ రూర్కీలో పూర్తి చేశారు. తన కెరీర్‌ను శ్రీరామ్ గ్రూప్‌తో మొదలు పెట్టారు. 1984 లో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ ఆయన్ని నియమించుకున్నారు. ఆ తర్వాత ఇంకో 14 ఏళ్లు ప్రేమ్ జీతో కలిసి విప్రోను విస్తరించారు. 1984 లో విప్రో ఇన్‌ఫోటెక్ బిజినెస్ కేవలం 2 మిలియన్ డాలర్లు మాత్రమే, 1999 నాటికి కంపెనీ ఐటీ బిజినెస్ 500 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ టైమ్‌లో విప్రో ఇన్‌ఫోటెక్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న అశోక్ కంపెనీని ముందుండి నడిపించారు. 1999 లో విప్రో నుంచి బయటకు వచ్చేసిన ఆయన, మరో 10 మందితో కలిసి ఐటీ కంపెనీ మైండ్ ట్రీని స్థాపించారు. అక్కడి నుంచి ఇంకో పదేళ్లలోనే మిడ్ టైర్ ఐటీ సెక్టార్‌లో సక్సెస్ ఫుల్ కంపెనీగా మైండ్ ట్రీ ఎదిగింది. మైండ్ ట్రీ 2007 లో మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ కంపెనీ కూడా ఐపీఓ ధర కంటే 103 శాతం ఎక్కువ ధరతో మార్కెట్లో లిస్ట్ అయి బంపర్ బోణీ చేసింది. ఆ తర్వాత అశోక్ సూతకు, కంపెనీ కో–ఫౌండర్ల మధ్య గొడవలు చెలరేగాయి. గొడవలు ఏ కారణాన వచ్చాయో బయటకు తెలియలేదు. కానీ మొబైల్ తయారీ బిజినెస్‌లోకి కంపెనీని తీసుకెళ్లి , కంపెనీకి తీవ్ర నష్టాలు తీసుకొచ్చాడని, అందుకే అశోక్‌కు ఇతర ఫౌండర్లకు మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీంతో పాటు మైండ్ ట్రీ ఫౌండర్, సీఈఓగా చేస్తూ ఇతర ఫౌండర్లకు పనులు అప్పగించడంలో అశోక్ ఫెయిల్ అయ్యాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదైమైనా మైండ్ ట్రీలో తన మొత్తం వాటాను అమ్మేసి కంపెనీ నుంచి బయటకొచ్చేశారు అశోక్ సూత.
డిఫరెంట్‌గా బిజినెస్..
మైండ్ ట్రీ నుంచి బయటకు వచ్చేసిన అశోక్, తన కెరీర్‌కు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. మైండ్ ట్రీని స్థాపించినట్టే 2011లో మరో 10 మందితో కలిసి తన 68 వ ఏట హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను స్టార్ట్ చేశారు. ఆ వయసులో బిజినెస్ స్టార్ట్ చేసిన అశోక్ తిరిగి సక్సెస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇండియన్ ఐటీ సెక్టార్‌లో పోటీ తీవ్రంగా ఉందని భావిస్తున్న టైమ్‌లో, ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను తెచ్చారు. దీంతో చాలా మంది ఆయన ఫెయిల్ అవుతాడని అభిప్రాయపడ్డారు. కానీ ఏ ఒక్క ఐటీ కంపెనీ కూడా అనుసరించని బిజినెస్ మోడల్‌తో హ్యాపీయెస్ట్ మైండ్స్ ని తీర్చి దిద్దారు. అప్పటి వరకు ట్రెడిషనల్‌గా వెళుతున్న కంపెనీల మాదిరి కాకుండా, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫోకస్‌ను డిజిటల్ టెక్నాలజీల వైపు మరల్చారు. ‘అప్పటికే లీడర్లగా ఉన్న ఐటీ కంపెనీలు కూడా డిజిటల్ టెక్నాలజీలపై 50 శాతం మాత్రమే ఫోకస్ చేసేవి. కానీ హ్యాపీయెస్ట్ మైండ్స్ దృష్టి మొత్తం డిజిటల్ పైనే ఉండేది’ అని చెబుతుంటారు అశోక్. గ్లోబల్‌గా ఎపామ్ సిస్టమ్స్, ఎండవా, గ్లోబంట్ కంపెనీలు మాత్రమే ఈ మోడల్‌లో పనిచేస్తున్నాయని గతంలో చెప్పారు.
హ్యాపీగా బంపర్ లిస్టింగ్..
ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ షేర్లు గురువారం మార్కెట్లో బంపర్ లిస్టింగ్ అయ్యాయి. కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ. 351 వద్ద లిస్ట్ అయ్యింది. ఇది ఐపీఓలో కంపెనీ షేరు రూ. 166 కంటే ఏకంగా 111.14 శాతం ఎక్కువ. ఇంట్రాడేలో137.95 శాతం వరకు పెరిగి రూ. 395 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ షేరు రూ. 371 వద్ద ముగిసింది. గత వారం ఓపెన్ అయిన కంపెనీ ఐపీఓకి భారీ స్పందన వచ్చింది. కంపెనీ ఐపీఓ షేర్లు ఏకంగా 151 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. దీంతో గత పదేళ్లలో భారీగా సక్సెస్ అయిన ఐపీఓల సరసన నిలవగలిగింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 702 కోట్లను హ్యాపీయెస్ట్ మైండ్స్ సమీకరించింది. ఐపీఓలో కంపెనీ షేరును రూ. 165–166 వద్ద ఆఫర్ చేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్(ఇండియా)
ఈ ఐపీఓని మేనేజ్ చేశాయి
For More News..