![జ్వరంతో ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/ashram-school-student-dies-of-fever_3eHharlGmZ.jpg)
- వార్డెన్ పట్టించుకోలేదనిబంధువుల ఆందోళన
వెంకటాపురం, వెలుగు : జ్వరంతో బాధపడుతూ ఓ ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ చనిపోయాడు. వార్డెన్ పట్టించుకోకపోవడం వల్లే స్టూడెంట్ చనిపోయాడంటూ అతడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పేరూరు గ్రామానికి చెందిన సోయం వినీత్ (14) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం వినీత్‌కు జ్వరం రావడంతో స్థానిక హెల్త్ వర్కర్‌కు చూపించగా టాబ్లెట్ ఇచ్చారు.
రెండు రోజులు గడిచిన తర్వాత స్టూడెంట్‌ను అతడి అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించారు. శనివారం ఉదయం వినీత్‌కు మరోసారి జ్వరం, కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ధర్మారం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో ఆశ్రమ పాఠశాల వార్డెన్, హెచ్‌ఎం నిర్లక్ష్యం కారణంగానే వినీత్ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
జ్వరం వచ్చిన రోజే టాబ్లెట్ ఇచ్చారని... ఆ తర్వాత వినీత్ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని, కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ వినీత్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వార్డెన్, హెచ్‌ఎం పర్యవేక్షణాలోపం వల్లే వినీత్ చనిపోయాడని ఆరోపించారు. మృతుడి ఫ్యామిలీకి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.