Sheffield Shield: ఇతని పట్టుదలకు ఫిదా కావాల్సిందే.. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన ఆసీస్ క్రికెటర్

Sheffield Shield: ఇతని పట్టుదలకు ఫిదా కావాల్సిందే.. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ అష్టన్ అగర్ క్రికెట్ లో తన పట్టుదలను చూపించాడు. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ అందరినీ షాక్ కు గురి చేశాడు. జట్టు కోసం తాను పడిన కష్టం అతనిపై ప్రశంసలు కురిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెల్‌బోర్న్‌ వేదికగా  జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.  వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న అగర్ విక్టోరియాతో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశాడు. 

అగర్ బ్యాటింగ్ దిగడానికి ముందు అతను భుజం గాయంతో బాధపడుతున్నాడు. బ్యాటింగ్ చేయలేని పరిస్థితి. అయితే జట్టు కోసం బ్యాటింగ్ చేయడానికి గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆడింది ఐదు బంతులే అయినప్పటికీ తమ జట్టుకు 15 పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. అగర్ ను అడ్డుపెట్టుకొని జోయెల్ కర్టిస్ ఈ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి పేసర్లు తన శరీరానికి బంతులు వేసినా తన తెగువ చూపెట్టాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో అతనికి చప్పట్లతో ప్రేక్షకులు అభినందించారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే విక్టోరియా 8 వికెట్ల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 167 పరుగులకు ఆలౌటైంది. బదులుగా విక్టోరియా తమ తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 325 పరుగులు చేయగా.. 122 పరుగుల లక్ష్య ఛేదనలో విక్టోరియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసింది.