
- డీసీని గెలిపించిన ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ
- పూరన్, మార్ష్ మెరుపులు వృథా
విశాఖపట్నం: ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 210. ఏడు రన్స్‌కే మూడు వికెట్లు పడ్డాయి. ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి సగం మంది డగౌట్‌కు వచ్చేయడంతో ఆ జట్టు 65/5తో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు ఖాయమే అనుకుంటున్న సమయంలో డీసీ మ్యాజిక్ చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన యంగ్‌స్టర్ అశుతోష్ శర్మ (31 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 నాటౌట్) ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టాడు.
దాంతో ఏకపక్షం అనుకున్న ఆట.. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపగా..ఢిల్లీ ఒక్క వికెట్ తేడాతో లక్నోను ఓడించి ఐపీఎల్–18లో బోణీ చేసింది. సోమవారం వైజాగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత నికోలస్ పూరన్ (30 బాల్స్‌లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 75), మిచెల్ మార్ష్ (36 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72) మెరుపులతో లక్నో 20 ఓవర్లలో 209/8 స్కోరు చేసింది. మిచెల్ స్టార్క్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేజింగ్‌లో ఢిల్లీ 19.3 ఓవర్లలో 211/9 స్కోరు చేసి గెలిచింది. విప్రజ్ నిగమ్ (15 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), ట్రిస్టాన్ స్టబ్స్ (34) కూడా రాణించారు. అశుతోష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ధనాధన్.. ఫటాఫట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో మార్ష్, పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మార్ష్ ఎదుర్కొన్న తొలి బాల్‌నే సిక్స్‌గా మలిచాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో మరో ఓపెనర్ మార్‌క్రమ్ (15 ) సిక్స్ కొడితే.. మార్ష్ వరుసగా 4, 6, 4 దంచాడు. నిగమ్ బౌలింగ్‌లో మార్‌క్రమ్ ఔటైనా పూరన్ రాకతో లక్నో స్పీడు మరింత పెరిగింది. నిగమ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మార్ష్ 21 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పూరన్ మూడు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఈ ఇద్దరి ధాటికి 11 ఓవర్లకే లక్నో 125/1 స్కోరు చేసింది. ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్స్ కొట్టిన మార్ష్ మరో షాట్‌కు ట్రై చేసి ఔటవ్వడంతో రెండో వికెట్‌కు 87 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అయినా వెనక్కు తగ్గని పూరన్.. స్టబ్స్ వేసిన 13వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 తో 28 రన్స్ రాబట్టాడు. తన జోరు చూస్తుంటే లక్నో ఈజీగా 250 మార్కు దాటేలా కనిపించింది. ఈ టైమ్‌లో ఢిల్లీ బౌలర్లు పుంజుకున్నారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (0)ను కుల్దీప్ డకౌట్ చేశాడు.
తర్వాతి ఓవర్లోనే పూరన్‌ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో జెయింట్స్ స్పీడుకు బ్రేకు పడ్డాయి. బదోనీ (4), శార్దూల్ ఠాకూర్ (0), షాబాజ్ అహ్మద్ (9), బిష్ణోయ్ (0) ఫెయిలవగా.. ఇన్నింగ్స్ చివరి రెండు బాల్స్‌కు రెండు సిక్సర్లు కొట్టిన మిల్లర్ (27 నాటౌట్) స్కోరు 200 దాటించాడు.
పడినా లేచి..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఢిల్లీ తడబడినా.. అద్భుతంగా పుంజుకొని గెలిచింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మెక్‌గర్క్ (1), అభిషేక్ పోరెల్ (0)ను ఔట్ చేసిన జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ డీసీని దెబ్బకొట్టాడు. సిద్దార్థ్ వేసిన రెండో ఓవర్లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి సమీర్ రిజ్వీ (4) కూడా నిరాశపరిచాడు. ఈ టైమ్‌లో ఓపెనర్ డుప్లెసిస్ (29), కెప్టెన్ అక్షర్ పటేల్ (22) నాలుగో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. కానీ, ఇద్దరూ వెంటవెంటనే ఔటవడంతో ఢిల్లీ 65 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది.
ఈ టైమ్‌లో అశుతోష్‌తో కలిసి ట్రిస్టాన్ స్టబ్స్ స్కోరు వంద దాటించాడు. స్పీడు పెంచే క్రమంలో సిద్దార్థ్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టిన స్టబ్స్‌తర్వాతి బాల్‌కే బౌల్డ్ అయ్యాడు. కానీ, క్రీజులో కుదురుకున్న అశుతోష్‌కు తోడైన విప్రజ్ నిగమ్ అనూహ్యంగా రెచ్చిపోయాడు. బిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్, షాబాజ్ బౌలింగ్‌లో 4, 6 రాబట్టాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అశుతోష్ 6,4... నిగమ్ రెండు ఫోర్లు బాదడంతో ఢిల్లీ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. చివరి నాలుగు ఓవర్లలో ఆ టీమ్‌కు 42 రన్స్ అవసరం అయ్యాయి. కానీ, 17వ ఓవర్లో నిగమ్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ దిగ్వేశ్ మూడు రన్స్ మాత్రమే ఇచ్చాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టార్క్ (2) ఎనిమిదో వికెట్‌గా ఔటవడంతో లక్నో పుంజుకుంది.
18వ ఓవర్ చివరి రెండు బాల్స్‌కు 6, 4,6 కొట్టిన అశుతోష్ ఆటను మరింత రసవత్తరంగా మార్చాడు. చివరి 12 బాల్స్‌లో డీసీకి 22 రన్స్ అవసరమ అయ్యాయి. 19వ ఓవర్లో కుల్దీప్ (4) రనౌటైనా చివరి రెండు బాల్స్‌కు 6,4 కొట్టి తన టీమ్‌ను రేసులో నిలిపాడు. షాబాజ్ వేసిన చివరి ఓవర్ తొలి బాల్‌కు మోహిత్ (1 నాటౌట్) స్టంపౌట్ చేసే చాన్స్‌ను కీపర్ పంత్ మిస్ చేశాడు. తర్వాతి బాల్‌కు మోహిత్ సింగిల్ తీయగా.. స్ట్రయికింగ్‌కు వచ్చిన అశుతోష్ భారీ సిక్స్‌తో ఢిల్లీని గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు:
లక్నో: 20 ఓవర్లలో 209/8 (పూరన్ 75,
మిచెల్ మార్ష్ 72, స్టార్క్ 3/42, కుల్దీప్ 2/20).
ఢిల్లీ: 19.3 ఓవర్లలో 211/9 (అశుతోష్ 66 నాటౌట్, విప్రజ్ నిగమ్ 39,
శార్దూల్ ఠాగూర్ 2/19, దిగ్వేష్2/31).