MI vs KKR: అరంగేట్రంలోనే అదరగొట్టిన అశ్వని కుమార్.. తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్

MI vs KKR: అరంగేట్రంలోనే అదరగొట్టిన అశ్వని కుమార్.. తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్

ఐపీఎల్ లో మరో యంగ్ స్టర్ వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన 23 ఏళ్ళ అశ్విని కుమార్ తొలి మ్యాచ్ లోనే తడాఖా చూపించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని ఔరా అనిపించాడు. ఈ లెఫ్టర్మ్ సీమర్ ఆరంభం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సత్యనారాయణ రాజు స్థానంలో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్వని.. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని  నిలబెట్టుకున్నాడు. తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసుకోవడం విశేషం. ఆఫ్ సైడ్ వేసిన బంతిని అజింక్య రహానే బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

11వ ఓవర్లో రింకూ సింగ్ కూడా ఇదే తరహాలో ఔటయ్యాడు. ఇదే ఊపులో అదే ఓవర్ చివరి బంతికి మనీష్ పాండేను క్లీన్ బౌల్డ్ చేశాడు. 13 ఓవర్ నాలుగో బంతికి రస్సెల్ ను మరో అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న అశ్వని కుమార్ ఐపీఎల్ లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ పంజాబ్ బౌలర్ ధాటికి కోల్ కతా 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవరాల్ గా మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.  

మొహాలీలో జన్మించిన అశ్వని షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నమెంట్‌లో తన ప్రదర్శనతో తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో ఎక్స్ పర్ట్. ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2024లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున అరంగేట్రం చేసిన అతను నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో 8.5 ఎకానమీతో మూడు వికెట్లు పడగొట్టాడు.