![రోజూ 700 మందికి పైగా పేదోళ్ల ఆకలి తీరుస్తున్నడు](https://static.v6velugu.com/uploads/2022/09/Ashwanth-Kumar-feeds-the-hunger-of-more-than-700-poor-people-every-day-in-Chennai_iosAEr176V.jpg)
పక్కవాళ్లు ఏమైపోతున్నా పట్టించుకోనివాళ్లే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో... ముక్కూ మొఖం తెలియనివాళ్లకోసం పని చేస్తున్నాడు ఇతను. పేదవాళ్లెవరూ ఆకలితో నిద్రపోకూడదని తనకున్న హోటల్‌ని ఛారిటీ హోటల్‌గా మార్చేసి ప్రతి రోజూ పేదల ఆకలి తీరుస్తున్నాడు. ‘ఇలా చేయడానికి స్ఫూర్తి.. మా నానమ్మే’ అని చెప్తున్న అశ్వంత్ కుమార్ స్వామినాథన్ గురించి..
చెన్నయ్, పెరంబూర్‌లో ఉండే అశ్వంత్ చదువు అయిపోగానే ‘ది భాయ్ ఫ్రెండ్’ అనే పేరుతో హోటల్, క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. బిజినెస్‌లో ఎంత సంపాదించినా అతనికి తృప్తి అనిపించలేదు. సరిగ్గా అప్పుడే తన నాన్నమ్మ పంకజం స్వామినాథన్ ‘జీవితంలో ఏం సాధించినా, ఎదుటివారికి సాయం చేస్తే వచ్చే ఆనందం ఇంక దేనిలో దొరకద’ని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో తను నడుపుతున్న హోటల్ పేరును ‘పంకజం ట్రస్ట్’గా మార్చాడు అశ్వంత్. దాని ద్వారా రోజూ 700 మందికి పైగా పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాడు.
నాన్నమ్మలా ఉండాలని
అశ్వంత్‌కు చిన్నప్పటినుంచి ఇంట్లో అందరికన్నా వాళ్ల నానమ్మ పంకజం అంటేనే ఎక్కువ ఇష్టం. ఆవిడతోనే ఆడుకోవడం, తను తినిపిస్తేనే తినడం, తన పక్కన నిద్రపోవడం చేసేవాడు. తను ఎక్కడికి వెళ్లినా వెంటే వెళ్లేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య బంధం బాగా పెరిగిపోయింది. పంకజానికి దానగుణం ఎక్కువ. పదిమందికి ఉపయోగపడే ఏ చిన్న సాయం అయినా చేస్తుండేది. యాచకులను, వీధులు తిరిగి కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఇంటికి పిలిచి మరీ అన్నం పెట్టేది. ఒకసారి ఆటోలో గుడికి వెళ్లినపుడు, ఆటో అతనికి ఇవ్వాల్సిన డబ్బుకన్నా 20 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. ‘ఎక్కువ డబ్బులు ఎందుకిచ్చావ’ని అశ్వంత్ అడిగితే.. ‘చేసింది చిన్న సాయమే. అతన్ని చూస్తే ఏవో కష్టాల్లో ఉన్నట్టు అనిపించింది. నేను ఇచ్చింది తక్కువే అయినా, తనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది’ అని చెప్పింది. పంకజం ఇంటినుంచి ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకునేది కాదు. వీటన్నింటికోసం తన పెన్షన్ డబ్బులనుంచే ఖర్చు చేసేది. ఆ సంఘటనలే అశ్వంత్‌ని మార్చేశాయి. ఆమెలాగే బతకాలని ఎప్పుడూ అనుకునేవాడు.
రూ.20కి ఫుల్ మీల్స్
పంకజం 2018లో చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఙ్ఞాపకంగా నడుపుతున్న హోటల్‌ని ‘పంకజం ట్రస్ట్’గా మార్చాడు. రెండు ఫుడ్ స్టాల్స్ పెట్టాడు. ట్రస్ట్ మెనూలో రోజుకో ఫుడ్ వెరైటీ ఉంటుంది. అంతేకాదు, ఆ ఊళ్లో ఉన్న ఆడవాళ్లెవరైనా తమకు వీలైన వాటిని వండి తీసుకురావచ్చు. దానికి డబ్బులు ఇస్తాడు. ఇలా చేయడంవల్ల ఆడవాళ్లకు ఉపాధి దొరుకుతుంది అంటాడు అశ్వంత్. ట్రస్ట్‌లో కొందరు డెలివరీ బాయ్స్ ఉంటారు. వాళ్లు ప్యాక్ చేసిన భోజనాన్ని వీధులన్నీ తిరుగుతూ, ‘ఆకలి’ అన్నవాళ్లకు ఇస్తుంటారు. ఫుడ్ స్టాల్స్‌లో 20 రూపాయలకు ఫుల్ మీల్స్ పెడుతున్నాడు. డబ్బు లేదన్న వాళ్లకు ఉచితంగానే భోజనం పెడతాడు. కరోనా టైంలో కూడా ఈ ట్రస్ట్ ద్వారా చాలామంది ఆకలి తీర్చాడు.అశ్వంత్ చేస్తున్న పని నచ్చి సరుకులను తక్కువ ధరకే ఇస్తుంటారు షాపులవాళ్లు. ఇంకొందరు ఫ్రీగా కూడా ఇస్తారు. చాలామంది ఈ ట్రస్ట్‌కు డొనేషన్స్ ఇస్తున్నారు. కొంతమంది వలంటీర్‌గా అవసరమైన పనులు చేస్తున్నారు.
‘ఆహారం అనేది కనీస అవసరం. అది అందక చాలామంది పస్తులుంటున్నారు. కొంతమంది చనిపోతున్నారు. మా చుట్టూ ఉన్నవాళ్లెవరూ ఆకలి బాధతో ఉండొద్దనేదే మా మోటో. అందుకే మాకు చేతనైన సాయం చేస్తున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువమందికి సాయం అందిస్తాం’ అని చెప్తున్నాడు అశ్వంత్.