- అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
అశ్వారావుపేట, వెలుగు: పార్టీలకతీతంగా పోడు హక్కు పత్రాలు అందిస్తున్నామని, బీఆర్ఎస్కు ఓటేయ్యకపోతే ఆ దేవుడే చూస్కుంటాడని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఎనిమిది గ్రామాల్లో పోడు హక్కు పత్రాలు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోడు హక్కు పత్రాలు తీసుకున్న వారికి రైతు బంధు కూడా వస్తుందని, బీఆర్ఎస్కు ఓటేయ్యకపోతే ఇక వారి కర్మ అన్నారు.
ఇదిలా ఉండగా గాండ్లగుడంలో హక్కు పత్రాలు లబ్ధిదారులకు అందిస్తుండగా కొందరు యువకులు తమకు హక్కు పత్రాలు రాలేదని, వారికి కావలసిన వారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు. వెంటనే పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి బయటకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, బండి పుల్లారావు, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.