
ములకలపల్లి,వెలుగు: ‘హాలో శుభోదయం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే ములకలపల్లిలో స్థానికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. అన్ని వీధులలో ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా పంచాయతీలోని విజయపురి కాలనీ, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, రాజుపేట, జడ్పీ హైస్కూల్ వద్ద రూ.30 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, ఎంపీడీవో రేవతి, పీఆర్ ఏఈ సురేశ్‌బాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
రంగాపురం అభివృద్ధికి కృషి
అన్నపురెడ్డిపల్లి/చండ్రుగొండ : రంగాపురం గ్రామాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.1.69 కోట్లు, చండ్రుగొండ మండలంలో రూ.1.68 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దళితవాడల అభివృద్ధికి గాను ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.10 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. రూ.5కోట్లతో ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఎన్ ఆర్ ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్లు మంజూరు చేశామన్నారు.
ఈ నెల 31 వరకు సీసీ రోడ్లపనులను నాణ్యతతో కంప్లీట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. నియోజకవర్గంలోని దత్తత గ్రామాల్లో వంద శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రంగాపురం గ్రామం నుంచి ఇటుకబట్టీ కూలీ పనులకు వలస వెళ్లే వారికి స్థానికంగా పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ శ్రీనివాస్, నాయకులు గాంధీ, పర్సా వెంకట్, రమణ, కట్టా శివ, కృష్ణారెడ్డి, భోజ్యానాయక్. సురేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.