అశ్విన్ దారెటు .. ఆసీస్‌‌లో ఏకైక స్పిన్నర్‌‌‌‌గా సుందర్‌‌‌‌కే మొగ్గు

అశ్విన్ దారెటు .. ఆసీస్‌‌లో ఏకైక స్పిన్నర్‌‌‌‌గా సుందర్‌‌‌‌కే మొగ్గు
  • మిగిలిన టెస్టుల్లోనూ సీనియర్‌‌ ప్లేయర్‌‌కు చోటు కష్టమే!

న్యూఢిల్లీ: రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌. కొన్నేండ్లుగా  టెస్టుల్లో టీమిండియా స్పిన్ ప్రధాన ఆయుధం. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తన అనుభవంతో ఆటను అద్భుతంగా చదివే సమర్థుడు. ఇప్పటికే 105 టెస్టులు ఆడిన అశ్విన్‌‌ 536 వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసన నిలిచాడు. ఇంత ఘనమైన రికార్డున్న  38 ఏండ్ల  అశ్విన్ సమీప భవిష్యత్తుపై స్పష్టత కనిపించడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌‌తో టెస్టు సిరీస్‌‌లో ఆకట్టుకోలేకపోయిన అశ్విన్‌‌కు  ఆస్ట్రేలియాతో బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ తొలి టెస్టులో  తుది జట్టులో చోటు దక్కలేదు. 

టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌ ఏకైక స్పిన్నర్‌‌‌‌గా వాషింగ్టన్ సుందర్‌‌‌‌ను ఆడించింది. ఈ సిరీస్‌‌లో మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ అశ్విన్‌‌కు చోటు దక్కడం కష్టమే. తర్వాతి మ్యాచ్‌‌ల్లో  పిచ్‌‌లు స్పిన్‌‌కు అనుకూలిస్తేనో,  సుందర్‌‌‌‌ చెత్తగా బౌలింగ్‌‌చేస్తేనో తప్ప బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అశ్విన్‌‌ బౌలింగ్‌‌ చేసే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ సుందర్ ఫామ్‌‌ కోల్పోయినా.. మేనేజ్‌‌మెంట్‌‌ అశ్విన్ కంటే  మరో స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్ జడేజాకే మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే సెనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌, న్యూజిలాండ్‌‌, ఆస్ట్రేలియా) అశ్విన్‌‌తో పోలిస్తే జడేజానే మెరుగ్గా బ్యాటింగ్‌‌ చేశాడు.

  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌లో ఆడుతున్నప్పుడు టీమ్ కాంబినేషన్‌‌ సహజంగానే భిన్నంగా ఉంటుంది. అయితే, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేనేజ్‌‌మెంట్ అశ్విన్‌‌ను బెంచ్‌‌పై కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్‌‌తో సొంతగడ్డపై సిరీస్‌‌లో రెండు మ్యాచ్‌‌లు టర్నింగ్ పిచ్‌‌లపై జరిగినా అశ్విన్‌‌ తొమ్మిది వికెట్లతో సరిపెట్టాడు. 

14 ఓవర్లకు ఒక వికెట్ 

ఆస్ట్రేలియా  సహా సేనా దేశాల్లో అశ్విన్ బౌలింగ్‌‌ గణాంకాలు మెరుగ్గా లేవు.  2021లో అడిలైడ్‌‌లో జరిగిన చివరి డే/నైట్ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌‌లో తీసిన (4/55) నాలుగు వికెట్లే ఈ దేశాల్లో అతనికి అత్యుత్తమం. ఈ నాలుగు దేశాల్లో అడిన టెస్టుల్లో అశ్విన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేయకపోవడం గమనార్హం. మొత్తంగా 43 ఇన్నింగ్స్‌‌ల్లో  రవిచంద్రన్‌‌ 71 వికెట్లు పడగొట్టాడు. తన స్ట్రయిక్ రేట్ 83.7 బాల్స్‌‌. అంటే  ఒక వికెట్‌‌ పడగొట్టేందుకు అశ్విన్‌‌ దాదాపు 14 ఓవర్లు తీసుకుంటున్నాడు. జడేజా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.

 ఈ దేశాల్లో ఆడిన 35 ఇన్నింగ్స్‌‌ల్లో తను 52 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క ఐదు వికెట్ల స్పెల్‌‌ను (6/138) పదేండ్ల కిందట సాధించాడు. అశ్విన్ మాదిరిగా ఒక వికెట్‌‌ కోసం  జడేజా కూడా 14 ఓవర్లు తీసుకుంటున్నాడు. అయితే, బ్యాటింగ్‌‌లో మాత్రం జడ్డూ ఆకట్టుకుంటున్నాడు.  ఈ నాలుగు దేశాల్లో దాదాపు 30 బ్యాటింగ్ సగటుతో ఐదు ఫిఫ్టీలు, ఒక సెంచరీ చేయగా.. అశ్విన్ రెండు ఫిఫ్టీలకే పరిమతం అయ్యాడు. అయితే, టాప్‌‌ క్లాస్ స్పిన్నర్ల నుంచి జట్టుకు మొదటగా కావాల్సింది వికెట్లు. అశ్విన్‌‌, జడేజా ఇద్దరు జట్టుకోసం  సేనా దేశాల్లో  గత పదేండ్లలో ఒకే ఒక్కసారి ఐదు వికెట్ల పెర్ఫామెన్స్‌‌ చేయడం వారి స్థాయికి ఏమాత్రం తగదని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.

 బ్యాటింగ్ పరంగా చూసుకున్నా ఈ ఇద్దరి కంటే ప్రస్తుతం సుందర్‌‌‌‌ టెక్నిక్ మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే పెర్తు టెస్టులో అశ్విన్‌‌, జడేజా ఇద్దరికీ చాన్స్ రాలేదు. ఇప్పుడు  వాషింగ్టన్‌‌కు గాయం అయితే తప్ప వీళ్లు తుది జట్టులోకి రావడం కష్టమే కానుంది. ఒకవేళ రాబోయే టెస్టుల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాల్సి వస్తే.. సుందర్‌‌‌‌ ఫామ్‌‌లో ఉంటే అతనికి తోడుగా అశ్విన్ బదులు జడేజాకే మొగ్గు ఉండనుంది.