- ఆత్మకథలో అశ్విన్ వెల్లడి
న్యూఢిల్లీ : టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను పంచుకునేందుకు ‘ఐ హావ్ ద స్ట్రీట్స్– ఎ కుట్టి క్రికెట్ స్టోరీ’ఆత్మకథతో ముందుకొచ్చాడు. ఇందులో ఓ మ్యాచ్ మధ్యలో శ్రీశాంత్‌ను ఇంటికి పంపించాలని ఎంఎస్ ధోనీ .. అశ్విన్‌కు చెప్పిన ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. 2010లో పోర్ట్ ఎలిజబెత్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇతర రిజర్వ్ ప్లేయర్లతో కలిసి డగౌట్‌లో కూర్చోవాలన్న సూచనను పట్టించుకోని శ్రీశాంత్‌కు మహీ తనదైన శైలిలో ఎలా బుద్ధి చెప్పాడో అశ్విన్ వివరించాడు.
‘ఆ మ్యాచ్‌లో నేను కూడా రిజర్వ్ ప్లేయర్‌గా ఉండి గ్రౌండ్‌లో ధోనీకి వాటర్ బాటిళ్లు అందిస్తున్నా. శ్రీశాంత్ కనిపించడం లేదు.. ఎక్కడున్నాడని ధోనీ నన్ను అడిగాడు. తను పైన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని చెప్పడంతో కిందికి వచ్చి మిగతా రిజర్వ్ ప్లేయర్లతో కలిసి కూర్చోమని చెప్పమన్నాడు. ఇదే విషయాన్ని నేను శ్రీశాంత్‌కు చెప్పినా తను డ్రెసింగ్ రూమ్‌లోనే ఉండిపోయాడు. మరోసారి ధోనీ వద్దకు వెళ్లగానే ‘‘నువ్వు ఒక పని చేయు. రంజిబ్ సర్ (టీమ్ మేనేజర్ రంజిబ్ బిశ్వాల్) దగ్గరకు వెళ్లి శ్రీశాంత్‌కు ఇక్కడ ఉండాలన్న ఆసక్తి లేదని చెప్పు.
రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేయమను. తను ఇండియా వెళ్లిపోతాడు”అని చెప్పమన్నాడు. నేను పరుగెత్తికెళ్లి శ్రీశాంత్‌కు విషయం చెప్పా. దెబ్బకు టీమ్ డ్రెస్ వేసుకొని అతను క్షణాల్లో డగౌట్‌కు వెళ్లాడు. తర్వాత ధోనీ డ్రింక్స్ అడిగినప్పుడల్లా తనే తీసుకెళ్లాడు’ అని అశ్విన్ తన పుస్తకంలో వివరించాడు.