బ్రాండెడ్ కంపెనీని నడిపే మేనేజ్మెంట్లకు కస్టమర్లే దేవుళ్లు. అయితే ఆ ప్రొడక్ట్ వాడుతున్న కస్టమర్ల రెస్పాన్స్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అయితే ప్రొడక్ట్ గురించి ఎవరు? ఎక్కడ? ఎక్కువ మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కంపెనీలకు. అలాంటి కంపెనీలకు ఉపయోగపడే స్టార్టప్‌తో ఫోర్బ్ లిస్ట్‌లో చోటు సంపాదించాడు కేరళకు చెందిన ‘అశ్విన్ శ్రీనివాస్’ . అండర్ 30 కేటగిరీలో ప్రతిష్టాత్మక స్థానంలో నిలిచాడు. అశ్విన్‌కు 26 ఏండ్లు. కొచ్చిలోని పనంపిల్లి నగర్లో నివాసం. తల్లి ప్రిన్సిపాల్. తండ్రి పొలిటీషియన్. అశ్విన్ కొచ్చిలోని చాయిస్ స్కూల్లో చదువుకున్నాడు. డిగ్రీ కోసం అమెరికా వెళ్లాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివాడు. చిన్నతనం నుంచి తెలివైన అబ్బాయిగా పేరుతెచ్చుకున్నాడు అశ్విన్. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాడు. అమెరికాలో చదువుతున్న టైంలో స్టార్టప్ ప్లాన్ చేశాడు. అలా మొదట ‘హీలియా డీలింగ్’ అనే స్టార్టప్ మొదలుపెట్టాడు. ఇది ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీకి సంబంధించిన స్టార్టప్. ఎక్స్‌పీరియెన్స్ వచ్చాక ‘క్యాంప్ ఫైర్ ’ అనే మరో స్టార్టప్ స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టప్‌లో సిలికాన్ వ్యాలీకి చెందిన పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేశాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడి కస్టమర్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రొడక్ట్ రెస్పాన్స్‌ను ట్రాక్ చేస్తుంది ‘క్యాంప్ ఫైర్’. కస్టమర్లను పూర్తిగా అర్థం చేసుకోవడంలో కీలకంగా పని చేస్తుంది. ఉదాహరణకు.. స్మార్ట్‌ఫోన్‌లు తయారుచేసే కంపెనీని తీసుకుంటే... ఆ కంపెనీ ఫోన్ల గురించి కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి ఎవరైనా పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారా? యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్రమోటర్లు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? వంటివి తెలుసుకొనే వీలుంది. ‘కొవిడ్ కారణంగా కస్టమర్స్.. కంపెనీలతో మాట్లాడే పద్ధతిలో, కస్టమర్స్ నుంచి కంపెనీలు నేర్చుకొనే పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే కస్టమర్ల దృష్టిలో కంపెనీ బ్రాండ్‌ను పెంచడం ఎంత ముఖ్యం అని మేనేజ్మెంట్లు ఆలోచిస్తున్నాయి ఇప్పుడు’ అంటున్నాడు అశ్విన్. ఎంటర్‌ప్రైజ్ కంప్యూటర్ విజన్ స్పేస్‌లో పనిచేసిన అశ్విన్ మొదటి స్టార్టప్ ‘హీలియా’. దీన్ని కిందటి ఏడాది ‘స్కేల్ ఏఐ’ కొనుక్కుంది.