
- నాకు డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు ఇచ్చినట్టు ఎట్ల ప్రకటిస్తరు..
- డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్థిక సహాయం లభించలేదని ఇండియా డబుల్స్ వెటరన్ షట్లర్ అశ్విని పొన్నప్ప చెప్పింది. ఒలింపిక్స్ ముంగిట పర్సనల్ కోచ్ కావాలన్న తన అభ్యర్థనను కూడా తిరస్కరించారని తెలిపింది. తనకు ఆర్థిక సాయం చేయకుండానే చేసినట్టు దేశ ప్రజలకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారిస్ గేమ్స్‌లో పోటీపడ్డ అథ్లెట్లకు అందించిన ఆర్థిక సాయం గురించిన వివరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఇటీవల వెల్లడించింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద అశ్వినికి రూ. 4.5 లక్షలు, ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్ (ఏటీటీసీ) కోసం వార్షిక క్యాలెండర్ కింద రూ. 1.48 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. దీనిపై అశ్విని ఆభ్యంతరం వ్యక్తం చేసింది.
‘సాయ్ వివరాలు చూసి నేను షాక్ అయ్యాను. నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చినట్టు దేశానికి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సాయ్ నుంచి నేను సాయం తీసుకోలేదు. నేషనల్ క్యాంప్ గురించి మాట్లాడితే ఆ రూ.1.5 కోట్లు క్యాంప్‌లోని అందరిపై ఖర్చు చేశారు. నాకంటూ నిర్దేశిత కోచ్‌ను ఏర్పాటు చేయలేదు. నా పర్సనల్ ట్రైనర్‌కు నేనే జీతం ఇస్తున్నా. 2023 నవంబర్ వరకూ సొంత ఖర్చుతోనే ట్రెయినింగ్ తీసుకున్నా. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాకే నన్ను, తనీషాను టాప్స్‌లో చేర్చారు. గతంలో క్రీడా శాఖ నన్ను చాలా సపోర్ట్ చేసింది. చాన్నాళ్లుగా ఇండియా టీమ్‌లో ఉంటున్నాను కాబట్టి నేను అందుకున్న సాయానికి థ్యాంక్స్. గతేడాది మాత్రం నాకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. దానికి ఓకే. కానీ, నాకు రూ. 1.5 కోట్లు ఇచ్చారనడం సరికాదు’ అని అశ్విని చెప్పుకొచ్చింది. ఇక తనకు కోచ్ లేకపోయినా పారిస్ ఒలింపిక్స్‌లో వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేసింది.