
గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ముూడ్ హన్మంతు నాయక్ గుండెపోటుతో మృతి చెందడంతో ఖమ్మం పట్టణంలో విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మూడ్ హన్మంతు మరిపెడ పీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరు అవుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
డ్యూటీలో అత్యుత్తమ సేవలందించినందుకు ఇటీవల ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు హనుమంత్. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. ఏఎస్సై మృతితో మర్రిగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
►ALSO READ | లిఫ్ట్ ఇచ్చి, చోరీ చేసి.. 9 నెలలకు దొరికిన్రు..పుస్తెలతాడు అపహరణ కేసులో నలుగురు అరెస్ట్
ఇదే నెలలో (ఏప్రిల్) గుండెపోటుతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేశ్ రాథోడ్(50) స్టేషన్ లో తోటి సిబ్బందితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతనికి సీఆర్పీ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తాజాగా మరో పోలీస్ అధికారి చనిపోవడం పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. విధులలో ఒత్తిడికి గురై గుండెపోటు ఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.